ఎమ్మెల్యేలూ... ఇక, పుల్ టైమ్ 'బిజినెస్'.. !
ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, ఎంపీ లు ఏం చేశారంటే.. సొంత వ్యాపారాలు.. వ్యవహారాల్లోనే మునిగి తేలుతున్నారని.. సాక్షాత్తూ.. సీఎం చంద్ర బాబే తరచుగా చెబుతున్నారు
By: Garuda Media | 5 April 2026 5:00 PM ISTరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి.. 23 నెలలు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, ఎంపీ లు ఏం చేశారంటే.. సొంత వ్యాపారాలు.. వ్యవహారాల్లోనే మునిగి తేలుతున్నారని.. సాక్షాత్తూ.. సీఎం చంద్ర బాబే తరచుగా చెబుతున్నారు. వారిని పనితీరు మార్చుకోవాలని కూడా ఆయన అంటున్నారు. ప్రజలకు చేరువ అవ్వాలని.. ప్రజల చుట్టూ తిరిగితేనే.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు వస్తాయని కూడా తేల్చేస్తున్నారు.
అయినప్పటికీ.. చాలా వరకునాయకులు ఏదో ముక్తసరిగా, కంటితుడుపుగానే వ్యవహరిస్తున్నారు. ఈ పరి ణామం ఇలా సాగుతుంటే.. ఇప్పుడు మరింతగా వారికి ఫ్రీడమ్ వచ్చింది. ఇప్పుడు నియోజకవర్గాల్లో తిరిగినా.. ప్రయోజనం లేదని ఒకరిద్దరు నాయకులు వ్యాఖ్యానించడం గమనార్హం. వచ్చే ఎన్నికల నాటికి.. నియోజకవర్గాల ముఖ చిత్రం పూర్తిగా మారనుంది. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కొత్త నియోజకవర్గాలు 50 కాకుండా.. ఏకంగా 88 పెరగనున్నాయి.
అంటే.. ఇప్పుడున్న ఏ నియోజకవర్గమైనా.. అలానే ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఇక, మండలాల విభ జన కూడా జరగనుంది. దీనికితోడు.. మహిళా రిజర్వేషన్, వారికి కేటాయించే ప్రత్యేక నియోజకవర్గాలు వంటివి కూడా.. తెరమీదికి వచ్చాయి. అంటే.. ఒక రకంగా ఇప్పుడు ఉన్న ఏ అసెంబ్లీ, ఏ పార్లమెంటు నియోజకవర్గం కూడా వచ్చే ఎన్నికల నాటికి యథాతథంగా ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా మార్పు లు జరగనున్నాయి.
జనరల్ నియోజకవర్గాల్లో ఎస్సీ స్థానాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. లేదా మహిళలకు కేటాయించినా.. ఆశ్చర్యం లేదు. ఈ పరిణామం ఇప్పుడు సిట్టింగు ఎమ్మెల్యేలకు అందివచ్చిన వరంగా మారింది. వారు చక్కగా ఎంజాయ్ చేసేందుకు మంచి అవకాశం లభించింది. ``ఇప్పుడే నియోజకవర్గంలో పర్యటించి ఏం చేస్తాం. వచ్చే ఎన్నికల నాటికి రాజెవరో..రెడ్డెవరో.. అసలు నియోజకవర్గం ఉంటుందో ఉండదో`` అనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఫలితంగా.. వారు మరింత ఎక్కువగా తమ వ్యాపారాలు వ్యవహారాలు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటి నుంచి నియోజకవర్గంలో తిరిగినా ప్రయోజనం లేదని భావిస్తున్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. తాము కష్టపడి ప్రజల మధ్యకువెళ్లినా.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మారే అవకాశం ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. సో.. మొత్తంగా పునర్విభజన నాయకులకు కలిసివచ్చేలా చేసింది.
