అయ్యో.. షర్మిల! పార్టీలోనే ఎందుకంత వ్యతిరేకత?
పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో నేతలు సహకరించడం లేదా? అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలు ఔననే సమాధానమిస్తున్నాయి.
By: Tupaki Desk | 23 Jun 2025 9:00 PM ISTపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో నేతలు సహకరించడం లేదా? అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలు ఔననే సమాధానమిస్తున్నాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నుంచి మాజీ సీఎం జగన్ వరకు అందరినీ తీవ్రంగా విమర్శిస్తూ రాజకీయ ప్రత్యర్థుల నిర్ణయాలను ఎండగడుతూ తన వాయిస్ వినిపిస్తున్న షర్మిలకు పార్టీ నేతలు నుంచి సహాయ నిరాకరణ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా మాజీ సీఎం జగన్ విషయంలో వ్యక్తిగత అజెండాతో ఆమె విమర్శలు ఉంటున్నాయని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు.
ఏపీ కాంగ్రెస్ లో అధ్యక్షురాలు షర్మిలకు పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవన్న ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం ఆమె వ్యవహారశైలి అంటూ కథనాలు వస్తున్నాయి. షర్మిల వైఖరితో విభేదిస్తున్న పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ఊహించింది ఒకటైతే రాష్ట్రంలో మరోకటి జరుగుతోందని అంటున్నారు.
మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రాండును సొంతం చేసుకుని ఏపీలో పునఃవైభవం తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీ పెట్టుకున్న రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిలను పార్టీలో చేర్చుకుంది. ఆమెను తెలంగాణ రాజకీయాల నుంచి ఏపీకి తీసుకువచ్చింది. అంతేకాకుండా తెలంగాణ లేదా కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు పంపి పార్టీ వాయిస్ వినిపించాలని భావించింది.
కాంగ్రెస్ ప్రణాళికలో భాగంగా షర్మిల గట్టిగా తన వాయిస్ వినిపిస్తున్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వ విధానాలపై గళం విప్పుతున్నారు. అయితే షర్మిల తన వ్యక్తిగత అజెండాతో ప్రభుత్వంపై కన్నా ఎక్కువగా తన సోదరుడు, మాజీ సీఎం జగన్ పై ఫోకస్ చేయడాన్ని రాష్ట్ర పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. కేవలం జగన్ టార్గెట్ గానే షర్మిల ఎక్కువగా వాయిస్ వినిపించడం వల్ల ప్రయోజనం ఉండటం లేదని ఆ పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఈ కారణంగానే మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ పార్టీకి రాజీనామా చేశారంటున్నారు.
షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చాలా కాలంగా పార్టీని పట్టించుకోకుండా ఉండగా, కర్నూలు జిల్లా కొడుమూరు ఎమ్మెల్యే మురళీ కృష్ణ కూడా తాజాగా పార్టీకి బైబై చెప్పేశారు. ఆయన ఏకంగా షర్మిల పనితీరుపై పెదవి విరుస్తూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని అంటున్నారు.
రాజశేఖరరెడ్డి కుమార్తెగా షర్మిల కాంగ్రెస్ ను ఉద్దరిస్తారని భావిస్తే, ఆమె పార్టీ పగ్గాలు చేపట్టాక రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మరింత తీసికట్టులా మారిందని విమర్శిస్తున్నారు. దీనికి ప్రతిగా అనంతపురం, కడపలో ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో షర్మిలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ సీనియర్ నేత సుంకర పద్మశ్రీ కూడా చాలాకాలంగా రష్మిలతో విభేదిస్తున్నారు. ఈ పరిణామాలపై పీసీసీ చీఫ్ షర్మిల ఒకసారి సమీక్షించుకోవాలని పరిశీలకులు సలహా ఇస్తున్నారు.
