పొలిటికల్ ఈక్వేషన్స్ పక్కా...జగన్ అధికారం దక్కేనా ?
ఏపీలో కూటమి బలంగా ఉంది. ఇందులో రెండవ మాట అయితే లేదు. కూటమిలో మూడు పార్టీలు కలసికట్టుగా ఉంటున్నాయి.
By: Satya P | 23 Jan 2026 7:00 PM ISTఏపీలో కూటమి బలంగా ఉంది. ఇందులో రెండవ మాట అయితే లేదు. కూటమిలో మూడు పార్టీలు కలసికట్టుగా ఉంటున్నాయి. తెలుగుదేశం జనసేన బీజేపీల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు. పైగా ఈ మూడు పార్టీలు సుదీర్ఘ కాలం కలసి ఉండాలని బలంగా కోరుకుంటున్నాయి. సాధారణంగా చూస్తే పొత్తులు ఎత్తులు అన్నీ అధికారం కోసమే ఉంటాయి. ఒక్కసారి చేతిలో అధికారం పడగానే అక్కడితో విభేదాలు వస్తాయి. దాంతో అటోమేటిక్ గా పొత్తులు విచ్చిన్నం అవుతూంటాయి. ఇది దేశంలో అనేక చోట్ల అనేక సార్లు జరిగింది. కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. టీడీపీ కూటమికి పెద్దన్నగా ఉంది. జనసేన అయితే ఇప్పట్లో అధికారం చేపట్టాలని ఆతృత పడడంలేదు, బీజేపీ కూడా కేంద్రంలో మరోసారి రావాలని ఆలోచిస్తోంది తప్ప ఏపీలో తాము కుర్చీ కోసం రేసులో ఉండాలని భావించడం లేదు. సరిగ్గా ఈ ఆలోచనలే కూటమిని కట్టుగా ఉంచగలుగుతున్నాయి.
వారి ఇమేజ్ తో :
ఇక ఏపీలో చూస్తే చంద్రబాబు పట్ల ఒక రకమైన ఇమేజ్ జనంలో ఉంది. ఆయన పనిమంతుడు అని చెబుతారు. ఏపీ అభివృద్ధి కోసం బాబు సీఎం గా ఉండాలని కొన్ని వర్గాలలో బలంగా ఉంది. ఇక పవన్ విషయం తీసుకుంటే ఆయన పార్టీకి బలమైన సామాజిక వర్గం దన్ను ఉంది. పవన్ కి మాస్ ఇమేజ్ ఉంది. దాంతో పాటు పొలిటికల్ గ్లామర్ గా కూటమికి ఆయన మారారు. బీజేపీకి కేంద్రంలో మోడీ అతి పెద్ద దిక్కుగా ఉన్నారు. మోడీది లక్కీ హ్యాండ్. ఆయన పట్టిందల్లా బంగారం అన్న సెంటిమెంట్ ఉంది. ఆయనతో ఎవరు కలసి ఉంటే వారిదే విజయం అని అనేక ఎన్నికలు దేశంలో నిరూపిస్తున్నాయి. ఈ విధంగా చూస్తే కనుక ఏపీలో కూటమి పట్ల సానుకూలత ఉంది.
ఓటు షేర్ ఇలా :
ఇక 2019లో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. అయినా కానీ ఓటు షేర్ 40 శాతంగా వచ్చింది. జనసేనకు ఆరు నుంచి ఎనిమిది శాతం ఓటు షేర్ పక్కాగా ఉంది. ఇక బీజేపీకి రెండు శాతం ఓటు షేర్ ఉంది. పొత్తులు ఉంటే అది మూడు నుంచి నాలుగు శాతం అవుతుంది. ఇందులో కొద్దో గొప్పో తేడా తప్ప పెద్దగా తగ్గేది ఉండదన్న విశ్లేషణలు ఉంటాయి. అంటే ఈ విధంగా చూసినా కూటమి ఓటు షేర్ 50 శాతం పైగానే ఉంది అని లెక్కలు పక్కాగా చెబుతున్నాయి.
విడిపోతేనే తప్ప :
ఈ సమీకరణలు రాజకీయ పరిస్థితులను ఆసరాగా చేసుకునే విజయసాయిరెడ్డి జగన్ మళ్ళీ అధికారంలోకి రారు అని జోస్యం చెప్పారు అని అంటున్నారు. కూటమి కలసికట్టుగా ఉన్నంతవరకూ వైసీపీకి నో చాన్స్ అని ఆయన తేల్చేశారు. జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా ఉపయోగం లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా పార్టీని సంస్థాగతంగా బలంగా చేసుకోవాలని కోటరీ దాటి బయటకు చూడాలని కూడా సలహా ఇచ్చారు.
జనంలో భావన :
విజయసాయిరెడ్డి అన్నారని కాదు కానీ ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా అదే మాట చెబుతున్నాయని అంటున్నారు. విడివిడిగా బాబు మోడీ పవన్ ల పట్ల అభిమానం ఉన్న జనాలు ఉన్నారు. అలాంటివి వారు అంతా ఒక్కటిగా ఉండి ముందుకు వస్తే సహజంగానే ఎడ్జ్ కూటమికే ఉంటుందని అంటున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ఏపీ లాంటి స్టేట్ కి ఎంతో మేలు జరుగుతుంది అన్న భావన కూడా జనంలో ఉంది. పైగా పవన్, చంద్రబాబు తరచూ ఒకే మాట చెబుతున్నారు. ఏపీలో ఒకే ప్రభుత్వం కనీసం పదిహేనేళ్ళ పాటు కొనసాగితేనే అభివృద్ధి ఫలాలు వస్తాయని అంటున్నారు.
అద్భుతమే అవుతుందా :
ఇక కూటమిని దాటి వైసీపీ వైపు చూసేందుకు అక్కడ బలమైన ఆల్టర్నేషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ కూడా ఉండాలని అంటున్నారు. పైగా వైసీపీ తన పాలనలో చేసిన తప్పులను సవరించుకుని కొత్తగా తాము ఏపీకి ఏమి చేయగలమో వివరించాల్సి ఉంది. మొత్తంగా చూస్తే కూటమి వర్సెస్ వైసీపీ అంటే పరిస్థితి ఇలాగే ఉంది. కానీ దానిని కూడా పూర్వ పక్షం చేసి ఒంటరిగా పోటీ చేసి వైసీపీ గెలిస్తే మాత్రం అది అద్భుతం అవుతుంది. మరి అది అయ్యే పనేనా అంటే వేచి చూడాల్సిందే.
