కూటమి రెండేళ్ళ పాలన...మూడు భారీ సభలు
ఈ నేపధ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న కూటమి తరఫున మూడు పార్టీల అధినేతలతో కలిసి భారీ బహిరంగ సభలను మూడు ప్రాంతాలలో నిర్వహించాలని నిర్ణయించారు.
By: Satya P | 6 Jun 2026 9:38 AM ISTఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్ళు ఈ నెల 12 కి పూర్తి అవుతాయి. 2024 లో సరిగ్గా అదే రోజున కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఎంతో మంది కీలక నేతల సమక్షంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వం కొలువు తీరింది. మొత్తం అరవై నెలలకు గానూ జనాలు ఇచ్చిన అధికారంలో 24 నెలలు పూర్తి అయిపోయినట్లే. మరి ఈ రెండేళ్ళ పాలనలో టీడీపీ కూటమి ఏమి చేసింది ఏమి సాధించింది అన్నది జనాలకు తెలియ చెప్పడానికి భారీ యాక్షన్ ప్లాన్ ని రూపొందించింది.
బాబు దిశా నిర్దేశం :
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ళ కాలంలో అనేక విజయాలను సాధించామని ఆ పెద్దలు చెబుతున్నారు. తాజాగా జరిగిన కేబినెట్ మీటింగులో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు ప్రభుత్వం గడచిన కాలంలో ప్రజలకు చేసిన మేలు ఏమిటి అన్నది వివరించాలని కోరారు. అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఇదే తీరున చెబుతున్నారు. ఇక ఇంటింటికీ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు వెళ్ళి మరీ కూటమి పాలన గురించి విజయాల గురించి తెలియ చేస్తారు అని అంటున్నారు.
మూడు ప్రాంతాలలో :
ఈ నేపధ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న కూటమి తరఫున మూడు పార్టీల అధినేతలతో కలిసి భారీ బహిరంగ సభలను మూడు ప్రాంతాలలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మూడు సభలలో ఒకటి తిరుపతిలో ఈ నెల 9న నిర్వహిస్తారు అని అంటున్నారు. అంటే రాయలసీమ ప్రాంతం కేంద్రంగా ఈ సభ జరగనుంది. అలాగే ఈ నెల 12న కూటమి ప్రభుత్వం ప్రమాణం చేసిన రోజున అమరావతి వేదికగా రెండవ సభను నిర్వహిస్తారు అని అంటున్నారు. ముచ్చటగా మూడవ సభను విశాఖపట్నంలో ఈ నెల 15న నిర్వహిస్తారు అని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర కేంద్రంగా ఈ సభ సాగుతుందని చెబుతున్నారు.
బాబు పవన్ కలసికట్టుగా :
ఈ మూడు సభలలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలసి కట్టుగా ఒకే వేదిక మీద కనిపించనున్నారు. అలాగే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్ కూడా ఈ సభలలో ఆ పార్టీ తరఫున పాల్గొంటారు అని అంటున్నారు. ఏపీలో రెండేళ్ళ కూటమి పాలనలలో జరిగిన అభివృద్ధి అలాగే పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు వంటి వాటి మీద జనాలకు వివరించే ప్రయత్నంలో భాగమే ఈ భారీ బహిరంగ సభలు అని చెబుతున్నారు. ఈ సభలను విజయవంతం చేయడం ద్వారా ఏపీలో కూటమి రెండేళ్ళ పాలన సక్సెస్ రూట్ లో సాగుతోందని చెప్పడం కూటమి పెద్దల ఆలోచనగా ఉందని అంటున్నారు. ఇదే ఊపులో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం రెండేళ్ళ పాలననే అతి పెద్ద ప్రచారాస్త్రంగా మార్చుకోనుంది అని అంటున్నారు. మరి ఈ సభల ద్వారా బాబు పవన్ ఏ విధంగా ప్రసంగాలు చేస్తారో ప్రత్యర్ధి వైసీపీని ఏ విధంగా టార్గెట్ చేస్తారో వేచి చూడాల్సి ఉంది అని అంటున్నారు.
