Begin typing your search above and press return to search.

బీజేపీకి బాధ్య‌త లేదా?

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో అధికారం పంచుకున్న బీజేపీ.. తెల్ల‌వారి లేస్తే.. హిందూత్వ‌ను త‌మ‌కు పునాదిగా పేర్కొంటుంది.

By:  Garuda Media   |   6 Feb 2026 10:36 AM IST
బీజేపీకి బాధ్య‌త లేదా?
X

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో అధికారం పంచుకున్న బీజేపీ.. తెల్ల‌వారి లేస్తే.. హిందూత్వ‌ను త‌మ‌కు పునాదిగా పేర్కొంటుంది. హిందూత్వ ప‌రిర‌క్ష‌ణ కోస‌మే తాము పార్టీ పెట్టామ‌ని కూడా నాయ‌కులు ఎన్నిక‌ల స‌మ‌యంలో చెబుతుంటారు. మ‌రి అలాంటి హిందూత్వ‌కు వైసీపీ హ‌యాంలో పాత‌రేసే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టార‌ని.. బీజేపీ మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు ఆరోపిస్తున్నారు. అనేక ఆధారాల ను కూడా వెలుగులోకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో గ‌త వారం రోజులుగా రాష్ట్రంలో తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం మ‌రింత దుమారం రేపుతోం ది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎంతో ఇష్ట‌ప‌డే నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న సీఎం చంద్ర‌బాబుపైనే వైసీపీ నాయ‌కుడు అంబ‌టి రాంబాబు దుర్భాష‌ల‌తో దూకుడు పెంచారు. మ‌రోవైపు.. వైసీపీ నాయ‌కులు కూడా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రి ఇంత జ‌రుగుతున్నా.. బీజేపీ త‌ర‌ఫున ఒక్క వాయిస్ అయినా.. బ‌య‌ట‌కు వ‌చ్చిందా? అంటే లేద‌నే చెప్పాలి.

నిజానికి ఎంతో బ‌ల‌వంతం మీద‌.. మంత్రి స‌త్య‌కుమార్ మాత్ర‌మే చేద్దామా.. వ‌ద్దా.. అన్న‌ట్టుగా తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారంపై కామెంట్లు చేశారు. మ‌రి మిగిలిన నాయ‌కుల మాటేంటి? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? పోనీ.. పార్టీ అధిష్టానం మౌనంగా ఉందా? అంటే.. గత నెల‌లోనే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌యంగా రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు, ముఖ్యంగా ఎంపీల‌కు కూడా.. చంద్ర‌బాబును, కూట‌మి ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్ధించాల‌ని చెప్పారు.

వైసీపీ చేస్తున్న రాద్ధాంతాన్ని మీరు కూడా ఎండ‌గ‌ట్టాల‌ని ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా వారికి హిత‌వు ప‌లికారు. అయినప్ప‌టికీ.. బీజేపీలో ఉన్న బల‌మైన నాయ‌కులు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికానీ, కేంద్ర మంత్రి వ‌ర్మ కానీ.. రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధ‌వ్ కానీ.. ఇత‌ర నేత‌లు సోము వీర్రాజు, విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి వంటివారు ఎందుకు మౌనంగా ఉంటున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌.

దీనిని బ‌ట్టి బీజేపీకి సంబంధం లేదా? లేక‌.. ఈ వ్య‌వ‌హారాన్ని కేవ‌లం టీడీపీవ‌ర్సెస్ వైసీపీ వివాదంగా చూస్తున్నారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం కూట‌మి నేత‌ల‌తో చంద్ర‌బాబు చ‌ర్చించే వ‌ర‌కు వ‌చ్చిందంటే.. ప‌రిస్థితి ఎలా ఉందో బీజేపీ నాయ‌కులు అర్ధం చేసుకోవాలి. క‌ల‌సి క‌ట్టు గా ఉండ‌డం అంటే.. కేవ‌లం ఎన్నిక‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాదు.. అన్ని విష‌యాల్లోనూ క‌లిసి క‌ట్టుగా ఉండాలి.