Begin typing your search above and press return to search.

భారత్ లోని 50 లక్షల్లో ఏపీకి 10 లక్షలు.. దావోస్ లో బిగ్ మూవ్!

ఈ సందర్భంగా వీరిరువురూ... అమరావతిలో క్యాంటం కంప్యూటింగ్‌ సెంటర్‌ ఏర్పాటుపై ఐబీఎం సీఈవోతో చర్చించారు.

By:  Raja Ch   |   21 Jan 2026 8:56 AM IST
భారత్  లోని 50 లక్షల్లో ఏపీకి 10 లక్షలు.. దావోస్  లో బిగ్  మూవ్!
X

ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌ ను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా దావోస్‌ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు.. ప్రముఖ ప్రపంచ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఐబీఎం చైర్మన్ తో భేటీ సందర్భంగా అద్భుతమైన ప్రతిపాదన పెట్టగా.. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

అవును... దావోస్ లోని వార్షిక ప్రపంచ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్... పెట్టుబడి ప్రోత్సాహం, అధునాతన సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు, గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించిన ఉన్నత స్థాయి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ప్రధానంగా... ఏపీని పెట్టుబడిదారులకు అనుకూలమైన గమ్యస్థానంగా ఉంచడంపై ప్రాధాన్యతనిస్తూ అనేక మల్టీ నేషనల్ కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఐబీఎం ఛైర్మన్‌, సీఈవో అరవింద్ కృష్ణ.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా వీరిరువురూ... అమరావతిలో క్యాంటం కంప్యూటింగ్‌ సెంటర్‌ ఏర్పాటుపై ఐబీఎం సీఈవోతో చర్చించారు. ఈ సందర్భంగా.. ఏపీలో క్వాంటం ఇన్నోవేషన్‌ సెంటర్‌ నెలకొల్పాలని అరవింద్ కృష్ణను సీఎం చంద్రబాబు కోరారు. ఈ సమయంలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భారత్‌ లోని 50 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని ఐబీఎం నిర్ణయించగా.. అందులో ఏపీలో 10 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో.. ఈ ప్రతిపాదనలకు ఐబీఎం సీఈవో సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఈ భేటీకి సంబంధించిన వివరాలను చంద్రబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇందులో భాగంగా.. క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తును రూపొందించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుందని.. బలమైన క్వాంటం పర్యావరణ వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో క్వాంటం వ్యాలీ, పెద్ద ఎత్తున నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం తమ ప్రణాళికల ద్వారా ఇప్పటికే గణనీయమైన చర్యలు తీసుకున్నామని.. ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ నేడు దావోస్‌ లో ఐబీఎం ఛైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతో సమావేశమైనట్లు తెలిపారు.

అనంతరం.. గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్‌ తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ నిర్మాణంపై ఇద్దరి మధ్య చర్చ జరగగా.. ఆలస్యం లేకుండా డేటా సెంటర్‌ నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఇదే సమయంలో... వ్యాపారం వేగవంతం చేయడం పట్ల తమ నిబద్ధత ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపు పూర్తి మద్దతును తాను ఈ సందర్భంగా పునరుద్ఘాటించినట్లు చంద్రబాబు వెల్లడించారు.

కాగా... ముఖ్యమంత్రి చంద్రబాబు స్విట్జర్లాండ్‌ లోని భారత రాయబారి మృదుల్ కుమార్‌ ను ఇప్పటికే కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్విస్ కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌ కు ఆకర్షించడానికి మద్దతు కోరారు. ప్రధానంగా.. ఔషధాలు, వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్, భారీ యంత్రాలు, అధునాతన తయారీ రంగాలలో అవకాశాలను ఆయన వివరించారు. కృత్రిమ మేధస్సు, క్వాంటం టెక్నాలజీ, నైపుణ్య అభివృద్ధిపై బలమైన దృష్టితో రాష్ట్రం 25 కొత్త పారిశ్రామిక విధానాలను ప్రవేశపెట్టిందని తెలిపారు.