75 ఏళ్ల వయసులో ఇదేం పని చంద్రబాబు!
గురువారం చంద్రబాబు షెడ్యూల్ ను పరిశీలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఉదయం తన మంత్రివర్గ సహచరుడు నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహానికి పాలకొల్లు వెళ్లిన చంద్రబాబు అక్కడ చాలా సేపు గడిపారు.
By: Tupaki Desk | 25 Sept 2025 5:45 PM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దూసుకుపోతున్నారు. వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్న చంద్రబాబు.. పని రాక్షసుడు అన్న విమర్శకుల వ్యాఖ్యలను నిజం చేస్తున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు. 75 ఏళ్ల వయసులో కూడా ఆయనలో విసుగు, విరామం కనిపించడం లేదు. నవ యువకుడిలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తాను పరిగెడుతూ పక్కనున్న వారిని పరుగులు తీస్తున్నారు. ఉదయం నిద్ర లేచి నుంచి రాత్రి మళ్లీ నిద్రకు ఉపక్రమించేవరకు దాదాపు 18 గంటలు పైగా పనిచేస్తున్న చంద్రబాబు.. ఔరా అనిపిస్తున్నారు.
చంద్రబాబులా పనిచేయడం మరెవరికీ సాధ్యం కాదు.. ఆయనకు ఆయనే పోటీ అని రాజకీయ పరిశీలకులు తరచూ వ్యాఖ్యానిస్తుంటారు. దీన్ని నిజం చేస్తున్నట్లే ఆయన పనితీరు ఉంటుంది. బుధవారం రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు కార్యక్రమాల్లో కనిపించిన చంద్రబాబు ప్రతి చోటా రెట్టించిన ఉత్సాహంతో కనిపించడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితో పోల్చిచూస్తున్న విమర్శకులు చంద్రబాబు పనితీరును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
గురువారం చంద్రబాబు షెడ్యూల్ ను పరిశీలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఉదయం తన మంత్రివర్గ సహచరుడు నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహానికి పాలకొల్లు వెళ్లిన చంద్రబాబు అక్కడ చాలా సేపు గడిపారు. కుటుంబంతో ఆ కార్యక్రమానికి వెళ్లిన ఆయన సాయంత్రం విజయవాడ విమానాశ్రయంలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ స్వాగత కార్యక్రమానికి వెళ్లారు. అనంతరం ఆ తర్వాత దుర్గగుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక రాత్రికి విజయవాడ నుంచి తిరుపతి వెళ్లి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.
ఇలా ఒకే రోజు నాలుగు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొనడం చర్చనీయాంశం అవుతోంది. వయసురీత్యా చంద్రబాబులా పనిచేయడం వేరొకరికి కష్టమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వయసులో చంద్రబాబు ఇంతలా హుషారుగా ఉండటం విపక్ష నేత జగన్ కు నిద్రపట్టనీయడం లేదన్న చర్చ వినిపిస్తోంది. తరచూ చంద్రబాబు వయసును చూపుతూ ‘ముసలాయన’ ఇంకెంతకాలం పనిచేయగలరని మాజీ సీఎం జగన్ ప్రశ్నిస్తుంటారు. అయితే ఈ విమర్శలపై ఎప్పుడూ స్పందించని చంద్రబాబు తన పనితీరుతోనే సమాధానం చెబుతున్నారని అంటున్నారు.
గత ఏడాది నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలోనే తనలో 95 సీఎం ను చూస్తారని చంద్రబాబు ప్రకటించారు. అప్పట్లో చెప్పినట్లే గత 16 నెలలుగా చంద్రబాబు పనితీరు ఉందని అంటున్నారు. తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంతటి ఉత్సాహంతో పనిచేశారో? ఇప్పుడు అంతేస్థాయిలో పనిచేస్తున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ 16 నెలల కాలంలో 10 లక్షల పెట్టుబడులు తీసుకువచ్చిన సీఎం.. రాష్ట్రాభివ్రుద్ది కోసం రేయింబవళ్లు పనిచేస్తున్నారని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
