పేదలకు పట్టాభిషేకం అంటున్న బాబు
ఏపీ వ్యాప్తంగా ఏకంగా ఇరవై లక్షల మంది పేద కుటుంబాలకు ఆ రోజున బంగారు రోజులు తెస్తున్నామని కూటమి పెద్దలు గర్వంగా ప్రకటిస్తున్నారు.
By: Tupaki Desk | 28 March 2025 11:04 PM ISTఏపీ సీఎం చంద్రబాబు పేదలకు ఇక మంచి రోజులే అని నమ్మకంగా చెబుతున్నారు వారికి పట్టాభిషేకం చేస్తామని అంటున్నారు. ఈ నెల 30న పీ 4 అన్న కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఏకంగా ఇరవై లక్షల మంది పేద కుటుంబాలకు ఆ రోజున బంగారు రోజులు తెస్తున్నామని కూటమి పెద్దలు గర్వంగా ప్రకటిస్తున్నారు. ఇందుకోసం అమరావతిలో భారీ ఎత్తున కార్యక్రమానికి రంగం సిద్ధం అయింది ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసిన పేద కుటుంబాలను అక్కడికి ప్రత్యేకంగా బస్సులలో తీసుకుని వస్తున్నారు.
పీ 4 కాన్సెప్ట్ ని కూడా వినూత్నంగా డిజైన్ చేశారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న పది శాతం మంది ద్వారా అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను దత్తత తీసుకుని వారిని పైకి తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం సంధాకర్తగా ఉండడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
ఈ విధంగా చూస్తే కనుక ప్రభుత్వ,ప్రైవేట్,ప్రజల, భాగస్వామ్యంతో సమాజం లోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ4 ప్రాజెక్ట్ ఏపీలో మొదలవుతోంది అని అంటున్నారు. ప్రతీ పేద కుటుంబం ధనవంతుల ఆసరాతో ముందుకు సాగాలన్నది ఆశయంగా పెట్టుకున్నారు. తెలుగువారి కొత్త ఏడాది నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా శుభారంభం పలకనున్నారు. కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి స్వయం సహాయక సంఘాలు,విద్యార్ధులు,రైతులు,ఉపాధి కూలీలను ఆహ్వానించి ప్రత్యేక బస్సులు ద్వారా వారిని అమరావతికి తీసుకురానున్నారు.
ఈ కార్యక్రమం కోసం ప్రజలను తరలించే ప్రక్రియను రాష్ట్ర స్థాయి నుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో ఐజి స్థాయి ఉన్నతాధికారిని అలాగే మరో ముగ్గురు ఉన్నతాధికారులను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది.అలాగే ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని,ప్రతి బస్సుకు ఒక లైజన్ అధికారిని నియమించారు.
ఇక అమరావతికి సమీప జిల్లాల నుండి తరలించే వారిని అదే రోజు ఉదయం బయలు దేరే విధంగా చూసుకుని వారికి అల్పాహారం,మధ్యాహ్న భోజనం,రాత్రి భోజన ఏర్పాట్లు చేస్తారు. అదే సమయంలో దూర ప్ర్రాంత జిల్లాలకు చెందిన వారు ఒక రోజు ముందే బయలుదేరాల్సి ఉన్నందున రెండు రోజులకు తగిన వసతి ఏర్పాట్లు చేయనున్నారు.
ఇంకో వైపు చూస్తే పీ 4 ప్రారంభం కోసం అమరావతి సచివాలయం వద్ద ఉన్న సభా వేదిక వద్ద ఇప్పటికే ఏర్పాట్లన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయానికి నాంది పలికేలా ఈ కార్యక్రమం నిర్వహించాలని కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఏపీలో కోటిన్నర మంది పేదలు ఉన్నారని తెల్లకార్డులు చెబుతున్నాయి. అందులో అత్యంత పేదలు అంతే కచ్చితంగా సగానికి పైగా ఉంటారు.
పీ 4 ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే ఏపీలో డెబ్బై నుంచి ఎనభై వేల పేద కుటుంబాలలో నవోదయం వస్తుందని అంటున్నారు. వారంతా ఫ్యూచర్ లో అభివృద్ధికి నోచుకుని ప్రభుత్వంతో కలసి అడుగులు వేస్తారని భావిస్తున్నారు. పీ 4 ప్రాజెక్ట్ ని ఏపీ సహా అన్ని ప్రాంతాల నుంచి అంతా జాగ్రత్తగా గమనిస్తున్నారు. విజయవంతమైతే జాతీయ స్థాయిలోనూ అందరూ స్పూర్తిగా తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
