చంద్రబాబు నోట 'ఉరిశిక్ష' మాట!
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తైన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. అరాచకాలు, అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
By: Tupaki Desk | 12 Jun 2025 10:22 AM ISTఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తైన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. అరాచకాలు, అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకబ్జాలు, ఇప్పటికీ రౌడీషీటర్లకు ఆ పార్టీనుంచి మద్దతు దక్కుతుందంటూ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు నోట ఉరిశిక్ష మాట రావడం గమనార్హం.
అవును... గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు అన్నీ, ఇన్నీ కాదని, ఎసైన్డ్ భూములు బినామీలకు ఇప్పించారని.. వాటిని తమ పేర్లతో మార్చుకుని అమ్ముకున్నారని మండి పడిన చంద్రబాబు... భూ అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలను జైళ్లలో పెట్టడం మొదలుపెడితే.. జైళ్లు కూడా సరిపోయేలా లేవని అన్నారు. ఇప్పటికే వారి కబ్జాల్లో ఉన్న భూములు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఇదే సమయంలో.. రాష్ట్రంలో ఎవరైనా రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పిన చంద్రబాబు.. నక్సలైట్లు, ఫ్యాక్షనిస్టులు, మతతత్వశక్తుల్ని అణిచివేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అని అన్నారు. అయితే.. వైసీపీ ఐదేళ్ల పాలనలో చూపించిన ఉదాసీనత.. గంజాయి, డ్రగ్స్ ముఠాల్ని స్వేచ్ఛగా వదిలేయడం లాంటి దారుణాల ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోందని అన్నారు.
అసలు ఒక పార్టీ అధ్యక్షుడు వెళ్లి రౌడీషీటర్లను, గంజాయి అమ్మేవాళ్లను పరామర్శించడమేమిటని ప్రశ్నించిన చంద్రబాబు... ఇలాంటి పనుల వల్ల సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారని నిలదీశారు. ఓ పక్క ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తూ, మరోపక్క ఆడబిడ్డలకు రక్షణ లేదని గగ్గోలు పెడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇందులో భాగంగా... హీనమైన నేరాలాకు పాల్పడేవారికి ఈ భూమ్మీద చోటు లేదని.. అయితే, జైలుకు వెళ్లాలి.. లేకపోతే ఉరిశిక్ష పడాలి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా... అనంతపురంలో బాలిక హత్యపై స్పెషల్ కోర్టు పెట్టి దోషులకు మూడునెలల్లో శిక్ష పడేలా చూస్తామని.. ఇలాంటి ఉన్మాదుల్ని ఇంట్లోవాళ్లే బయటకు పంపేయాలని లేదా పోలీసులకు అప్పగించాలని సూచించారు.
అదేవిధంగా... వైఎస్సార్ కడప జిల్లాలో బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి పోలీసులు పంటుకుంటారన్న భయంతో జలాశయంలోకి దూకి చనిపోయినా.. కుటుంబసభ్యులు మాత్రం అతను మావాడే అని చెప్పేందుకు ముందుకు రాలేదని చెప్పిన చంద్రబాబు... రౌడీమూకలు, గంజాయి, డ్రగ్స్ అమ్మేవారి ఆస్తులు స్వాధీనం చేసుకుని.. వారి కుటుంబాలకు సంక్షేమ పథకాల్ని నిలిపివేయడం లాంటి చర్యలపై ఆలోచిస్తామని తెలిపారు.
