ఆడబిడ్డలకు నెలకు రూ.1500 - ముహూర్తం ఫిక్స్!?- చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం
ఎన్నికలు ముగిసి 20 నెలలు కావస్తుండటం, త్వరలో స్థానిక ఎన్నికలకు వెళ్లనుండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 25 Jan 2026 12:04 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో జోరు పెంచనుందా? సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి త్వరలో కీలకమైన పథకానికి శ్రీకారం చుట్టబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా అతిముఖ్యమైన ఆడబిడ్డ నిధి పథకంపై ఇన్నాళ్లు దాటవేస్తూ వస్తోంది. దీనిపై ప్రతిపక్షాల దాడి ఎక్కువగా ఉండటం, లబ్ధిదారులు సైతం ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారా? అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
ఆడబిడ్డ పథకం అమలు చేయాలంటే ప్రభుత్వం భారీగా వెచ్చించాల్సివస్తుంది. రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు అందరికీ నెలకు రూ.1,500 చొప్పున ఈ పథకం ద్వారా పంపిణీ చేస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదే కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని హామీలిచ్చారు. ఈ రెండింటిని ఇప్పటికే అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ లక్షల మంది మహిళలు ఉచిత బస్సును వినియోగిస్తున్నారు. ఇదే సమయంలో ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్న రూ.1500 ఎప్పటి నుంచి అమలు చేస్తారని ఎదురుచూస్తున్నారు.
ఎన్నికలు ముగిసి 20 నెలలు కావస్తుండటం, త్వరలో స్థానిక ఎన్నికలకు వెళ్లనుండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. పథకం అమలుకు అవసరమయ్యే విధి విధానాలను సిద్దం చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ పెద్దలు సూచించినట్లు సమాచారం. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు నెలనెలా డబ్బు జమ చేయాలా? లేక ఏడాదికి ఒకసారి చొప్పున ఇవ్వాలా? అన్నదానిపై చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 11 నుంచి ప్రారంభం అవుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఆడబిడ్డ నిధిపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 14న ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక బడ్జెట్ తోపాటు వ్యవసాయ బడ్జెట్, ఇరిగేషన్ కేటాయింపులపై ప్రత్యేక పద్దులు చూపించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలపైనా ప్రభుత్వం పెద్దగా ఫోకస్ చేసిందని అంటున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన తల్లికివందనం, అన్నదాతా సుఖీభవ, ఉచిత బస్సు, 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆడబిడ్డ నిధిపై విపక్షం నుంచి విమర్శలు వస్తుండటం, ఈ ఏడాది ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఏదో ఒక విధంగా రెండేళ్లు అమలు చేస్తే వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చని అంచనాతో ప్రభుత్వం పనిచేస్తోందని అంటున్నారు. దీంతో ఈ బడ్జెట్లో ఆడబిడ్డ నిధికి కేటాయింపులు ఉంటాయనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే బడ్జెట్ లో కేటాయింపులు చేసినా, ఆర్థిక సంవత్సరంలో ఎప్పటి నుంచి అమలు చేస్తారన్నదే ఉత్కంఠ రేపుతోంది.
