Begin typing your search above and press return to search.

క్యాన్సర్ కారణంగా తల్లి, సోదరిని కోల్పోయా...మంత్రి ఆవేదన

ఏపీలో ఇప్పటివరకు ఓరల్ టెస్టును ఒక కోటీ 39 లక్షల 7 వేల 523 మందికి ఉచితంగా పరీక్షలు చేశామని, ఇందులో అవసరమని గుర్తించిన లక్షల 41 వేల 179 మందికి దశల వారీగా పరీక్షలు జరుపుతున్నామని చెప్పారు.

By:  Satya P   |   1 Feb 2026 4:02 PM IST
క్యాన్సర్ కారణంగా తల్లి, సోదరిని కోల్పోయా...మంత్రి ఆవేదన
X

ప్రాణాంతకమైన వ్యాధిగా క్యాన్సర్ ని చెబుతారు. దీనికి నివారణ ముఖ్యం. ముందస్తుగా మేలుకుంటే వ్యాధి ముదరకుండా అడ్డుకట్ట వేయవచ్చు. అందుకే క్యాన్సర్ కట్టడికి పకడ్బందీ ప్రణాళికని కూటమి ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. స్క్రీనింగ్ పరీక్షల ద్వారా ప్రాథమిక దశలోనే బాధితుల గుర్తింపుని చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్సని మెరుగుపరిచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

భావోద్వేగమైన మంత్రి :

ఇదిలా ఉంటే విశాఖ జరిగిన వాక్ థాన్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. అది అందరినీ కదిలించింది. ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ కారణంగా తన తల్లిని సోదరిని కోల్పోయాను అన్నారు. అలా క్యాన్సర్ ప్రభావం తనను తీవ్రంగా కలచివేసింది అని చెప్పారు. అందుకే ఈ పరిస్థితులను అన్నీ చూసిన తాను వైద్య శాఖకు మంత్రి కాగానే పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకాన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ ఫైలుపై పెట్టానని గుర్తు చేశారు. అంతే కాకుండా ఏపీలో క్యాన్సర్ కేసులు తగ్గించేందుకు నాణ్యత కలిగిన వైద్యాన్ని అందుబాటులోనికి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా ప్రజలలో అవగాహన తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలను శాఖాపరంగా తీసుకుంటున్నట్లుగా మంత్రి వివరించారు.

తొలి దశలో గుర్తిస్తే :

ఇదిలా ఉంటే తొలిదశలోనే గుర్తిస్తే క్యాన్సర్ బారి నుంచి బయటపడవచ్చునని మంత్రి చెప్పారు. అందుకే రాష్ట్రంలో ఎన్సీడీ-04 నాన్-కమ్యూనికబుల్ డీసిజ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఓరల్ బ్రెస్ట్ సర్వైకల్ లక్షణాలతో ఉన్న వారిని ఉచిత పరీక్షల ద్వారా గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఇదిలా ఉంటే ఆయన ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. ఏపీలో చూస్తే క్యాన్సర్ కేసుల పెరుగుదల జాతీయ సగటు కేసుల నమోదుతో పోల్చితే ఎక్కువగా ఉందని మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు 2020 నాటికి 25,487 కేసులు ఉండగా 2025 నాటికి 35,546కు కేసులు అయ్యాయని ఇది 39.5 శాతంగా ఉందని అన్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో 12.8 శాతం మాత్రమే కేసులు పెరుగుతున్నాయని గణాంకాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 18 శాతం మంది ప్రతి ఏటా క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారని మంత్రి చెబుతూ అందులో భారత్ మూడవ స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. అందుకే ఈ కేసులను తగ్గించేందుకు ఓరల్, బ్రెస్టు, సర్వైకల్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలను మొదలు పెట్టామని వివరించారు.

సంకోచం వద్దు అంటూ :

ఏపీలో ఇప్పటివరకు ఓరల్ టెస్టును ఒక కోటీ 39 లక్షల 7 వేల 523 మందికి ఉచితంగా పరీక్షలు చేశామని, ఇందులో అవసరమని గుర్తించిన లక్షల 41 వేల 179 మందికి దశల వారీగా పరీక్షలు జరుపుతున్నామని చెప్పారు. ఇక ఇందులో ఇప్పటి వరకూ చూస్తే 98 కేసులు నిర్ధారణ అయినట్లు మంత్రి చెప్పారు. ఇక బ్రెస్ట్ పరీక్షను 73 లక్షల 78 వేల 836 మంది మహిళలకు చేయగా తదుపరి పరీక్షలు అవసరమని గుర్తించిన ఒక లక్ష 65వేల 22 మందికి మళ్ళీ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. అందులో ఇప్పటివరకూ 104 కేసులు బయటపడ్డాయని మంత్రి చెప్పారు. క్యాన్సర్ పరీక్షల కోసం ఇళ్లకు వచ్చే సిబ్బందికి సహకరించి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు. సంకోచించకుండా పరీక్షలు చేయించుకోవాలని ఏమరుపాటుగా ఉండొద్దని అదే విధంగా ఆందోళన చెందనక్కర్లేదని సూచించారు.

గుడ్ మార్నింగ్ వైజాగ్-గుడ్ బై క్యాన్సర్ :

విశాఖలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన వాక్ థాన్ కార్యక్రమానికి హాజరైన వేలాది మంది ప్రజల చేత మంత్రి సత్యకుమార్ గుడ్ మార్నింగ్ వైజాగ్-గుడ్ బై క్యాన్సర్ అంటూ నినాదాలు చేయించారు. ప్రతీ ఒక్కరూ ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండడమే కాకుండా ఇతరులకు కూడా తెలియచేయాలని దాని వల్ల వ్యాధిగ్రస్తుల సంఖ్యను గణనీయంగా తగ్గించగలమని చెప్పారు.

రాష్ట్రంలోనే తొలి పెయిన్ క్లినిక్ :

ఇదిలా ఉంటే రాష్ట్రంలోనే తొలి పెయిన్ క్లినిక్ విశాఖలోని కేజీహెచ్ లో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. దీర్ఘకాలిక క్యాన్సర్ సంబంధిత నొప్పులతో బాధపడుతున్న రోగులకు పెయిన్ క్లినిక్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. రాబోయే రోజులలో కీమోథెరపీ, రేడియోథెరపీ, పెయిన్ మేనేజ్‌మెంట్ అంశాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి క్యాన్సర్ వైద్య సేవలను రాష్ట్రంలో మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను బలోపేతం చేస్తూ, పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేయడం విశేషం.