బాబు కేబినెట్ లోకి రాజు గారు ?
ఏపీలో మంత్రివర్గ విస్తరణ కానీ మార్పులు చేర్పులు కానీ ఉన్నాయా అంటే వాటి మీద ఎప్పటికపుడు ప్రచారం మాత్రం జరుగుతోంది నిజానికి చూస్తే రాష్ట్ర మంత్రివర్గం ఏర్పడి పదహారు నెలలు మాత్రమే గడచాయి.
By: Tupaki Desk | 26 Oct 2025 12:00 PM ISTఏపీలో మంత్రివర్గ విస్తరణ కానీ మార్పులు చేర్పులు కానీ ఉన్నాయా అంటే వాటి మీద ఎప్పటికపుడు ప్రచారం మాత్రం జరుగుతోంది నిజానికి చూస్తే రాష్ట్ర మంత్రివర్గం ఏర్పడి పదహారు నెలలు మాత్రమే గడచాయి. ఎక్కడైనా మంత్రివర్గంలో మార్పులు చేయాలంటే కనీసం రెండేళ్ల వ్యవధి పెట్టుకుంటారు. వైసీపీ హయాంలో జగన్ అయితే మూడేళ్లకు మంత్రి వర్గం మార్చారు. కానీ ఏపీలో ఎందుకు ఈ విధంగా మంత్రి వర్గం విషయంలో ప్రచారం సాగుతోంది అంటే ప్రస్తుతం పనిచేస్తున్న మంత్రుల విషయంలో కూటమి పెద్దలు కొంత అసంతృప్తిగా ఉన్నారని వార్తలు రావడం ప్రతిపక్ష వైసీపీని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు అన్న భావన ఉండడంతో అవి కాస్తా గాసిప్స్ రూపంలో బయటకు వస్తున్నాయి. సాధారణంగా మంత్రివర్గ సమావేశాలలో సీఎం తన మంత్రులకు దిశా నిర్దేశం చేయడం కామన్ గా ఉంటుంది. దానిని పట్టుకుని అదిగో విస్తరణ ఇదిగో ప్రక్షాళన అని మీడియా చిలవలు పలవలు చేస్తోంది అని అంటున్నారు.
కూటమి సర్కార్ కావడం :
మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అన్న వార్తలు బాగా ప్రచారంలోకి రావడానికి కూటమి పార్టీలు అధికారంలో ఉండడం కూడా మరో ప్రధాన కారణం అని అంటున్నారు. మూడు పార్టీల ఆశలు ఆకాంక్షలు తరచూ బయటపడుతూండడం వల్ల కూడా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని అనుకుంటున్నారు. ఆ మధ్య జనసేన కీలక నేత నాగబాబుకు మంత్రి వర్గంలో చోటు ఇస్తారని కూటమి పెద్దల నుంచే ప్రకటన వచ్చింది. ఆయన ఎమ్మెల్సీ అయినా అది ఎందుకో ఆగిపోయింది. ఆ విషయం అలా ఉంటే ఏపీ కేబినెట్ లో ఉన్నవి పాతిక బెర్తులు అయితే అందులో 2024 జూన్ 12న తీసుకున్నది 24 మంది మంత్రులనే. అందులో టీడీపీ నుంచి 20 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. దాంతో మంత్రివర్గం కూర్పులో తమకు కొంత అన్యాయం జరిగింది అని బీజేపీ నేతలు భావిస్తున్నారు అని ప్రచారం కూడా సాగుతోంది.
రాజు గారి ఆశలు :
ఇదిలా ఉంటే విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుకు మంత్రి పదవి మీద ఆశలు ఉన్నాయన్నది చాలా కాలంగా జరుగుతున్న ప్రచారమే. ఆయన విశాఖ ఉత్తరం సీటు నుంచి రెండు సార్లు గెలిచారు. బీజేపీలో విశాఖ నుంచి ఎమ్మెల్యే అయింది గతంలో హరిబాబు. ఆయన మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే కాలేదు, అఫ్ కోర్స్ ఎంపీ అయ్యారు అది వేరే విషయం. కానీ ఒకే నియోజకవర్గాన్ని అట్టిపెట్టుకుని వరసగా మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచి సొంతంగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నేతగా విష్ణు కుమార్ రాజు మంత్రి పదవి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అని అంటున్నారు.
కారణాలు అవేనా :
ఆయన గతంలోనూ ప్రస్తుతం బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయనకు మంచి వాగ్దాటి ఉంది. ప్రత్యర్థులను గట్టిగానే విమర్శించగలరు. రాజకీయ అనుభవంతో పాటు చాలా విషయాల మీద మంచి అవగాహన ఉంది. పైగా బలమైన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు. గోదావరి జిల్లాలకు చెందిన ఈ నాయకుడు విశాఖలో స్థిరపడ్డారు. విశాఖ జిల్లా వరకూ చూస్తే 2024 లో ఏర్పడిన కూటమి మంత్రివర్గంలో చోటు దక్కలేదు, ఇక క్షత్రియ సామాజిక వర్గానికి కూడా కేబినెట్ లో సీటు దక్కలేదు. దాంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రాజు గారి ఆశలు ఆకాంక్షలు సరైనవే అని అంటున్నారు.
ఈ సమీకరణలు సైతం :
బీజేపీ విషయానికి వస్తే జాతీయ స్థాయిలో పెద్ద పార్టీ. ఏపీలో కూటమిలో జూనియర్ పార్టనర్ గా ఉన్నా బీజేపీ అండతోనే ఎలక్షనీరింగ్ అంతా సవ్యంగా జరిగి కూటమి అధికారంలోకి వచ్చింది అని అంటున్న వారూ ఉన్నారు. ఇక 2014లో చూస్తే బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిస్తే అందులో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇపుడు ఏకంగా ఎనిమిది మంది గెలిచారు. ఇందులో నుంచి ఒకే ఒక్కరికి చాన్స్ ఇవ్వడం మీద మిగిలిన వారు అయితే అసంతృప్తిగా ఉన్నారు. జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. నాలుగవది ఇవ్వబోతారు అని ప్రచారంలో ఉంది. అలాంటిది బీజేపీకి రెండు అయినా మంత్రి పదవులు ఇవ్వలేరా అన్నది కూడా చర్చగా ఉంది. ఈ ఈక్వేషన్స్ ని దృష్టిలో ఉంచుకునే రాజు గారు మంత్రి పదవి కోరుతున్నారు అని అంటున్నారు.
కుండబద్దలు కొడుతూ :
ఇక ప్రతీ విషయం మీద ముక్కుసూటితనంతో కుండబద్ధలు కొట్టడం రాజు గారి అలవాటు. తాజాగా ఆయన విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు తో లక్షలాది ఉద్యోగాలు ఏమీ రావని కుండబద్దలు కొట్టారు. ఒక వైపు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున జాబ్స్ వస్తాయని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో రాజు గారు ఇలా చెప్పడం గమనార్హం. ఈ విధంగా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఏది ఏమైనా రాజు గారికి బాబు కేబినెట్ లో బెర్త్ దక్కుతుందా అంటే అది చూడాల్సిందే అని అంటున్నారు.
