Begin typing your search above and press return to search.

మంత్రుల్లో గుబులు.. ఇళ్లు మ‌రిచిపోయారు.. !

నిన్న మొన్న‌టి వ‌ర‌కు మ‌న‌కు ఎందుకులే అనుకుని ఇంటికే ప‌రిమిత‌మైన వారు.. కూడా ఇప్పుడు.. ఇళ్ల‌ను వ‌దిలేస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 July 2025 8:30 AM IST
మంత్రుల్లో గుబులు.. ఇళ్లు మ‌రిచిపోయారు.. !
X

ఇప్పుడు ఎక్క‌డ చూసినా.. నియోజ‌క‌వ‌ర్గాల్లో మంత్రుల సంద‌డి పెరిగిపోయింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మ‌న‌కు ఎందుకులే అనుకుని ఇంటికే ప‌రిమిత‌మైన వారు.. కూడా ఇప్పుడు.. ఇళ్ల‌ను వ‌దిలేస్తున్నారు. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్య‌క్ర‌మంలో జోరుగా పాల్గొంటు న్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా.. మంత్రులు క‌నిపిస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌రకు లేని సంద‌డి.. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నిపిస్తోంది.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు రంగం రెడీ అవుతున్న‌ద‌న్న చ‌ర్చే!. ఆశ్చ‌ర్యం కాదు. నిజం. ఈ విష‌యం పార్టీలోనూ చ‌ర్చ‌కు వ‌స్తోంది. నాయ‌కులు.. కార్య‌కర్త‌ల‌కు కూడా ఈ విష‌యం తెలిసింది. మం త్రివ‌ర్గాన్ని విస్త‌రించ‌డ‌మో.. లేక‌.. కొంత మందిని పక్క‌న పెట్టి.. మ‌రికొంద‌రిని తీసుకోవ‌డ‌మో ఖాయ‌మ‌ని తెలుస్తోంది. దీంతో రెడ్ జోన్‌లో ఉన్న మంత్రుల‌తో పాటు.. అంద‌రూ కూడా.. రంగంలోకి దిగారు. చంద్ర బాబు మ‌న‌స్త‌త్వంఎలా ఉంటుందో తెలిసిన వంగ‌ల‌పూడి అనిత వంటి వారు.. అయితే.. కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని మ‌రీ తిరుగుతున్నారు.

అనిత‌, స‌విత‌, అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌, కొండ‌ప‌ల్లి రాంప్ర‌సాద్‌రెడ్డి వంటి.. 10 మంది మంత్రులు అయితే.. అస‌లు ఇళ్ల‌ను కూడా మ‌రిచిపోయారు. నియోజ‌క‌వ‌ర్గాల్లోనే తిష్ట వేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎక్క‌డా విశ్రాంతి కూడా తీసుకోవ‌డం లేదు. ఒక రోజులో నాలుగు నుంచి ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తున్న మంత్రులు కూడా ఉన్నారు. స‌భ‌లు నిర్వ‌ష‌హించ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల‌ను కూడా క‌లుస్తున్నారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిందేంటి? ఇప్పుడు జ‌రుగుతున్న‌దేంటి? అనే విషయాల‌ను వారు వివ‌రిస్తున్నారు.

ఫ‌లితంగా ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాలు స‌హా.. అనంత‌పురంలో మంత్రుల హ‌డావుడి క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్న ప‌రిస్థితి కూడా క‌నిపిస్తోంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు లేనిఉత్సాహం.. క‌నిపిస్తున్నా.. చంద్ర‌బాబు ఏమేర‌కు వారిని క‌రుణిస్తార‌న్న‌ది మాత్రం ప్ర‌శ్న‌గానే ఉంది. ఎందుకంటే.. ఇప్ప‌టికే తెప్పించుకున్న రెండు మూడు స‌ర్వేల ఆధారంగా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. దీంతో ఎవ‌రిని ప‌క్క‌న పెట్టాల‌న్న విషయంపై ఆయ‌న క్లారిటీతో ఉన్నారు. దీనిని గ్ర‌హించే మంత్రులు ఇప్పుడు ప్ర‌జాబాట ప‌ట్టార‌ని తెలుస్తోంది. మ‌రి చంద్ర‌బాబు సింగ‌పూర్ నుంచి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.