అమరావతి రైతులకు ఎంతో మేలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
అమరావతి రైతులకు ఎంతో మేలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
By: Satya P | 10 July 2026 9:13 AM ISTఅమరావతి రైతులకు ఎంతో మేలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఈ నెల 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో సంచలన నిర్ణయాలను తీసుకోనుంది అని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అమరావతికి ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు భారీగానే రాయితీలు ఇవ్వనుంది అని అంటున్నారు. అలాగే రాజధాని కోసం భూములను కొత్తగా ఇచ్చే వారికి కూడా బ్రహ్మాండమైన రాయితీలను ఇవ్వనుంది అని తెలుస్తోంది. ప్రతీ ఎకరానికి ఏడాదికి నలభై వేల రూపాయల యాన్యూటీ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గ్రామ కంఠాలలో భూములు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలవడమే కాకుండా నెలకు పది వేల రూపాయలు వంతున అద్దె రూపంలో భత్యం చెల్లించాలని నిర్ణయించింది.
వారికి భారీ రుణ మాఫీ :
అంతే కాదు కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేసే గ్రామాల పరిధిలోకి వచ్చే రైతులకు లక్షన్నర వరకూ రుణ మాఫీ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. దాంతో వారంతా పూర్తి సంతోషంగా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మధ్యనే భూముల విషయంలో కొందరు రైతులు తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. దాంతో వారి విషయంలో కూటమి ప్రభుత్వం ఎంతదాకా అయినా మేలు చేసేందుకు ముందుకు వస్తోంది. అదే సమయంలో భూములను సమీకరించే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆలోచిస్తోంది అని అంటున్నారు.
భారీగా భూముల కేటాయింపులు :
అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. దాంతో అమరావతి ప్రాంతంలో ఆధ్యాత్మికంగా పారిశ్రామికంగా తీర్చిదిద్దడానికి చూస్తోంది. దాని కోసం వచ్చే వారికి పెద్ద ఎత్తున భూములు కేటాయించాలని చూస్తోంది. అలాగే పలు ప్రభుత్వ సంస్థలకు భూములను కేటాయించాలని అనుకుంటోంది. అంతే కాదు స్మార్ట్ సిటీ పరిధిలో 370 ఎకరాల ఇనాం భూములను దేవాలయ భూములను బదిలీ కోసం దేవాదాయ శాఖకు 159 కోట్ల రూపాయలు చెల్లించడానికి సీఆర్డీఏకి అనుమతి ఇవ్వనుంది అని అంటున్నారు.
రాజధాని అంశాలే కీలకం :
అదే అమరావతిలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఆధునిక పద్ధతిలో అక్వేరియం, అలాగే కార్యాలయ నిర్మాణానికి రెండు ఎకరాలను కేటాయించడానికి కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లీవింగ్ సంస్థకు ఈశా ఫౌండేషన్ కి కూడా పెద్ద ఎత్తున అమరావతిలో భూముల కేటాయింపు చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈసారి మంత్రివర్గ సమావేశంలో అమరావతి రాజధానికి సంబంధించిన అంశాలే కీలకంగా మారబోతున్నాయని అంటున్నారు.
