Begin typing your search above and press return to search.

బడ్జెట్ సెషన్... వైసీపీ ప్లాన్ అదేనా ?

ఏ ఎమ్మెల్యే అయినా రెండు సెషన్లు వరసగా కానీ లేదా అరవై పది దినాలు వరసగా కానీ అసెంబ్లీకి గైర్ హాజర్ అయితే కనుక కచ్చితంగా వారి మీద అనర్హత వేటు పడుతుందని నిబంధనలు చెబుతున్నాయని అంటున్నారు.

By:  Satya P   |   11 Feb 2026 6:00 AM IST
బడ్జెట్ సెషన్... వైసీపీ ప్లాన్ అదేనా ?
X

ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈసారి హీటెక్కించేయనున్నాయా.2024 తరువాత తొలిసారి పూర్తి స్థాయిలో వైసీపీ ఈ సమావేశాలకు హాజరు కాబోతున్నారా . ఈ ప్రశ్నలు అయితే అందరిలో ఉన్నాయి. గడచిన ఇరవై నెలలుగా వైసీపీ ఎమ్మెల్యేలు అంతా అసెంబ్లీకి డుమ్మా కొడుతూ వస్తున్నారు. దానికి వైసీపీ కారణాలు వారికి ఉన్నాయి. తమకు సభలో విపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అయితే నిబంధనల ప్రకారం అలా ఇవ్వడం కుదరదని ప్రభుత్వం వైపు నుంచి జవాబు వస్తోంది. దీంతో వైసీపీ సభకు దూరంగా ఉంటోంది.

ఏడాది తరువాత :

దాదాపు ఏడాది తరువాత జగన్ అసెంబ్లీకి వస్తున్నారు 2025 బడ్జెట్ సెషన్ కి ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో హాజరయ్యారు. ఆ తరువాత మళ్ళీ రాలేదు, ఇక వైసీపీ ఎమ్మెల్యేలతో కొందరు రిజిష్టర్ లో సంతకాలు చేసి సభకు హాజరు కాకుండానే జీతాలు అందుకుంటున్నారు అన్న విమర్శలు కూటమి ప్రభుత్వం చేస్తోంది. దీంతో దీని మీద ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. ఇంకో వైపు చూస్తే ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేస్తామని కూడా చెబుతున్నారు.

నిబంధనలు చూస్తే :

ఏ ఎమ్మెల్యే అయినా రెండు సెషన్లు వరసగా కానీ లేదా అరవై పది దినాలు వరసగా కానీ అసెంబ్లీకి గైర్ హాజర్ అయితే కనుక కచ్చితంగా వారి మీద అనర్హత వేటు పడుతుందని నిబంధనలు చెబుతున్నాయని అంటున్నారు. దాంతో వైసీపీ అనేక తర్జన భర్జనలు పడిన మీదట సభకు హాజరు కావాలని నిర్ణయించుకుంది. మరి తొలి రోజు మాత్రమే హాజరై సభ మొత్తానికి దూరంగా ఉంటారా లేక తరువాత కూడా హాజరవుతారా అన్నది చూడాలని అంటున్నారు.

పరిగణనలోకి వస్తుందా :

గవర్నర్ ప్రసంగానికి హాజరైతే దానిని సభకు హాజరైనట్లుగా పరిగణనలోకి తీసుకుంటారా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే సభ బిజినెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే హాజరు నమోదు పరిగణనలోకి వస్తుందని అంటున్నారు. దాంతో బడ్జెట్ సెషన్ కి 12వ తేదీ నుంచి వైసీపీ హాజరవుతుందని ఒక వైపు ప్రచారంలో ఉంటే జగన్ తాను ఒక్క రోజు హాజరైనా తన పార్టీ ఎమ్మెల్యేలను సభకు పంపిస్తారు అని అంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా కీలక నేతలతో పాటు ఎమ్మెల్యేలు హాజరై సభలో వైసీపీ తరఫున వాయిస్ వినిపిస్తారు అని అంటున్నారు.

బొత్స చెప్పిందిదే :

ఇక వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా సభకు హాజరవుతున్నారని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం తరువాత తిరిగి సభా వ్యూహాన్ని తమ పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. సభలో చర్చించాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని వాటిని గట్టిగా నిలదీస్తామని బొత్స చెప్పారు.

శాసనసభా పక్ష నేతగా :

ఇక వైసీపీ పూర్తి స్థాయిలో సభకు హాజరైతే శాసన సభా పక్ష నేతగా జగన్ కి స్పీకర్ గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా గుర్తిస్తే ఆయనకు సముచితమైన సమయం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ విధంగా జరుగుతుందా ఒక వేళ గుర్తిస్తే మొదటి వరసలో సీట్లు ఇస్తారా లేక ఎక్కడ కేటాయిస్తారు అన్నది మరో చర్చ. ఏది ఏమైనా వైసీపీ పూర్తి స్థాయిలో జరిగే చర్చలకు సిద్ధపడి బడ్జెట్ సెషన్ కి హాజరైతే బాగుంటుంది అని అంతా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.