పులివెందులలో పింఛన్ల ఏరివేతకు స్పెషల్ ఆపరేషన్? మాజీ సీఎం నియోజకవర్గం బోగస్ పింఛన్లు ఎన్నో తెలుసా?
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని భారీగా పెంచారు.
By: Tupaki Desk | 21 Aug 2025 11:22 AM ISTఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని భారీగా పెంచారు. ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే వితంతు, వృద్ధాప్య పెన్షన్ ను వెయ్యి పెంచి రూ.4 వేలు చేశారు. అదేవిధంగా వికలాంగుల పింఛనను రూ.3 వేల నుంచి ఒకేసారి రూ.6 వేలు చేశారు. అయితే వికలాంగ పింఛన్లలో భారీగా నకిలీలు ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. ప్రస్తుతం దాదాపు 7 లక్షల వికలాంగ పింఛన్లను ప్రభుత్వం అందిస్తుండగా, ఇందులో 5.10 లక్షల మంది సర్టిఫికెట్లను పునఃపరిశీలించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఇందులో 4.50 లక్షల మంది ఇప్పటికే తమ సర్టిఫికెట్లు తనిఖీ చేయించుకుని తమ అర్హతలు నిర్ధారించుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో దాదాపు లక్ష వరకు నకిలీ వికలాంగ సర్టిఫికెట్లతో పింఛన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరందరకీ పెన్షన్లు తొలగించే అవకాశం ఉందని అంటున్నారు.
వికలాంగ సర్టిఫికెట్ల పునఃపరిశీలనకు రాని 60 వేల మందిపై ప్రభుత్వ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఇష్టానుసారం నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసి పింఛన్లు మంజూరు చేశారని ఆరోపిస్తున్నారు. దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో తమ అనుచరులకు వికలాంగ పింఛన్లు పంపిణీ చేశారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో 1,708 బోగస్ పింఛన్లు గుర్తించినట్లు రాష్ట్ర సమాచార మంత్రి పార్థసారథి వెల్లడించారు.
పింఛన్ల పునఃపరిశీలన పేరిట భారీగా కోత విధివిస్తున్నట్లు వైసీపీ ఆరోపిస్తోంది. అయితే వైసీపీ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం నకిలీ పింఛన్లు మాత్రమే తొలగిస్తున్నట్లు స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే 60 వేల మందికి మరోమారు నోటీసులు జారీ చేస్తామని చెబుతోంది. అంటే వచ్చేనెలలో ఈ 60 వేల మందికి పింఛన్లు అందే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ప్రభుత్వ పరిశీలనలో నకిలీ, బోగస్ సర్టిఫికెట్ల ద్వారా పింఛన్లను తీసుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.
వాస్తవానికి సామాజిక భద్రత పింఛన్ల మంజూరులో ప్రభుత్వం రకరకాల అర్హతలను పరిశీలిస్తుంది. ముఖ్యంగా వికలాంగ పింఛన్ల మంజూరుకు మాత్రం డాక్టర్ల కమిటీ ద్వారా నిర్ధారించి జారీ చేసి సదరం సర్టిఫికెట్లను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటుంది. ప్రభుత్వమే గుర్తించిన డాక్టర్ల ద్వారా నిర్దేశిత ఆస్పత్రుల్లో మాత్రమే సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్లు ఉన్నవారికి మాత్రమే వికలాంగ పింఛన్లు మంజూరు చేస్తారు. అయితే గత ప్రభుత్వంలో ఈ సర్టిఫికెట్ల జారీ సమయంలోనే అవకతకలు జరిగాయని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
సదరం సర్టిఫికెట్ల తనిఖీల్లో మొత్తం లక్ష వరకు నకిలీలు ఉన్నట్లు గుర్తించగా, తనిఖీలకు రాని 60 వేల మందితో కలిపి సెప్టెంబరు నెలలో దాదాపు 1.60 లక్షల పింఛన్లు నిలిపివేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో పులివెందుల నియోజకవర్గంలోనే దాదాపు 1,708 బోగస్ పింఛన్లు ఉన్నాయని చెప్పడం ద్వారా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని సమర్థించుకోవాలని చూస్తోందని అంటున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు వీరంతా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అనుచరులేనా? అన్న చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలకు ఔట్ సోర్సింగు, కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చినట్లు గతంలో ఆరోపణలు వినిపించాయి. అదే పద్ధతిలో నకిలీ పింఛన్లు కూడా జారీ చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా పింఛన్ల తొలగింపు రాజకీయంగా దుమారం రేపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
