Begin typing your search above and press return to search.

కూటమి వ్యూహం- బీజేపీకి రెండో బెర్త్

ఏపీలో కూటమి పార్టీలకు చెందిన 24 మంది మంత్రులలో టీడీపీ జనసేన నుంచి మంత్రులు ఎక్కువగా స్పందిస్తున్నారు బీజేపీ నుంచి తగినంతగా స్పందన రావడం లేదన్న ప్రచారం ఉంది.

By:  Satya P   |   4 March 2026 5:00 AM IST
కూటమి వ్యూహం- బీజేపీకి రెండో బెర్త్
X

ఏపీలో టీడీపీ నాయకత్వంలోని కూటమిలో బీజేపీ కూడా ఉంది. అయితే మొత్తం 24 మంది మంత్రులలో బీజేపీకి ఒకే ఒక్కరు ఉన్నారు. ఏపీ శాసనసభలో బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2014 నుంచి 2018 మధ్యలో బీజేపీ అప్పటి టీడీపీ ప్రభుత్వంలో చేరింది. ఆనాడు నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరికి కేబినెట్ మంత్రి పదవులు ఇచ్చారు. ఈసారి ఆ నంబర్ డబుల్ అయినా ఒక్కరికే చాన్స్ దక్కింది. దాంతో కమలం పార్టీలో కొంత నిరాశ ఉంది. ఇదిలా ఉంటే బాబు కేబినెట్ లో బీజేపీ కోటాలో ఉన్న ఏకైక మంత్రి సత్య కుమార్ యాదవ్. ఆయన సబ్జెక్టు మీదనే ఎక్కువగా మాట్లాడుతారు. రాజకీయ విమర్శలు చేస్తారు కానీ ఆయన ఫోకస్ ఎపుడూ పాలనా వ్యవహారాల మీదనే ఉంటుంది.

దూకుడు చేయాల్సిందే :

ఏపీలో కూటమి పార్టీలకు చెందిన 24 మంది మంత్రులలో టీడీపీ జనసేన నుంచి మంత్రులు ఎక్కువగా స్పందిస్తున్నారు బీజేపీ నుంచి తగినంతగా స్పందన రావడం లేదన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్న లడ్డూ కల్తీ వ్యవహారం కానీ ఇతర అంశాలలో కానీ బీజేపీ గొంతు అయితే కొంత సన్నగా వినిపిస్తోంది అని అంటున్నారు. దాంతో బీజేపీని కూడా కలుపుకుని పోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కూటమి పార్టీలు మూడూ ఒకే గొంతుకతో బిగ్గరగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు.

విస్తరణలో చాన్స్ :

ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణలో బీజేపీకి చెందిన మరొకరికి చాన్స్ ఇస్తారు అని ప్రచారం సాగుతోంది. బీజేపీ మంత్రిగా ఉన్న సత్య కుమార్ యాదవ్ తన శాఖలో బాగానే పనిచేస్తున్నారు. ఆయన పాలనా పరంగా మంచి మార్కులే దక్కించుకుంటున్నారు. దాంతో ఆయనను కొనసాగిస్తూనే మరొకరికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్నది కూటమి పెద్దలలో ఆలోచనగా ఉంది అని అంటున్నారు.

సమీకరణలు సరిచూసుకుంటూ :

మూడు పార్టీలు ప్రభుత్వంలో ఉన్నా సామాజిక రాజకీయ ప్రాంతీయ సమతూకం సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. రాయలసీమలోని అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి సత్యకుమార్ యాదవ్ మంత్రిగా బీజేపీ తరఫున ఉన్నారు ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు దాంతో వేరే ప్రాంతం నుంచి మరో సామాజిక వర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేకు చాన్స్ ఉంటుందని అంటున్నారు. మంత్రిగా ఉంటూనే రాజకీయంగానూ దూకుడు చేసే వారికి అవకాశం ఇస్తారు అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే కోస్తా జిల్లాలకు చెందిన వారికి చాన్స్ ఉండొచ్చా అన్న చర్చ కూడా సాగుతోంది. విజయవాడ పడమట ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి పేరు గట్టిగా వినిపిస్తోంది అలాగే మరో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పేరు కూడా ఉంది అని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో చూస్తే విశాఖ నార్త్ నుంచి విష్ణు కుమార్ రాజు ఉన్నారు. ఆయన కూడా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. మరి ఆయనకు ఏమైనా అవకాశం ఉందా అన్న చర్చ సాగుతోంది.

బీజేపీ ఉంటేనే :

కూటమి అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపిస్తున్నారు. బీజేపీ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండాలని ఈ మూడు పార్టీల భాగస్వామ్యం ఉందని ప్రతీ విషయంలో ఒకే మాటగా బాటగా సాగుతున్నారు అన్న సందేశం జనాలలోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద మంత్రి వర్గ విస్తరణ ఎపుడు జరిగినా బీజేపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగుతోంది.