Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ బాస్ పీవీఎన్ మాధవ్.. ఎన్నిక లాంఛనమే!

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరు దాదాపు ఖరారయ్యే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.

By:  Tupaki Desk   |   30 Jun 2025 12:30 PM IST
ఏపీ బీజేపీ బాస్ పీవీఎన్ మాధవ్.. ఎన్నిక లాంఛనమే!
X

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరు దాదాపు ఖరారయ్యే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. సంఘ్ నేపథ్యం, బీసీ సామాజికవర్గం కావడం, పార్టీకి విధేయుడిగా ఉన్న గుర్తింపు ఆయనకు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జులై 1న బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది. కానీ, క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యమిచ్చే కమలం పార్టీ మాత్రం ఎన్నికను ఏకగ్రీవం చేయాలని అనుకుంటోంది. దీంతో సోమవారం పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించి మాధవ్ ఒక్కరితోనే నామినేషన్ వేయించేలా పావులు కదుపుతోంది.

గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన మాధవ్ మిత్రపక్షాలతోనూ సమన్వయం చేయగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాధవ్ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ సమయంలో మంచి పనితీరుతో అందరి మన్ననలు పొందారు. దీంతో ప్రస్తుతం ఆయనకు ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని భావించారు. అయితే మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు సీనియర్గా గుర్తించి ఎమ్మెల్సీ చేయడంతో మాధవ్ పేరు వెయిటింగు లిస్టులో ఉండిపోయింది.

రాష్ట్ర విభజన తర్వాత ఎమ్మెల్సీలుగా అగ్రవర్ణాల వారికే అవకాశాలిస్తుండటం వల్ల ఈ సారి బీసీ నేతకు చాన్స్ ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిందని అంటున్నారు. అధ్యక్ష పదవి కోసం పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చినా సంఘ్ నేపథ్యం, బీజేపీ భావజాలం ఉన్న నేతకే అవకాశం ఇవ్వాలని పార్టీ అగ్రనేతలు భావించారు. ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, పార్థసారథి, పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వంటివారు అధ్యక్ష పదవిని ఆశించినట్లు చెబుతున్నారు. అయితే అధిష్టానం అనుమతిస్తేనే అధ్యక్ష పదవి తీసుకుంటానని, పోటీకి తాను దూరం అంటూ సుజనా చౌదరి తేల్చిచెప్పారంటున్నారు. అదేవిధంగా పార్థసారథి సైతం కొత్తగా పార్టీలో చేరడంతో ఆయన పేరుపై పార్టీ పెద్దలు మొగ్గుచూపలేదని అంటున్నారు.

తొలి నుంచి బీజేపీలో ఉన్నవారికే పదవి అన్న సంకేతాలు ఇవ్వడంతో విష్ణువర్ధన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆయన గతంలో సీఎం చంద్రబాబుతో తీవ్రంగా విభేదించడంతో విష్ణుకు పదవి ఇస్తే తప్పుడు సంకేతాలిచ్చినట్లు అవుతుందని పార్టీ పెద్దలు వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. అదే సమయంలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో మాధవ్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సౌమ్యుడు, వివాద రహితుడు కావడంతో మాధవ్ పేరు పట్ల పార్టీలో ఏకాభిప్రాయం వ్యక్తమైందని అంటున్నారు. ఆయన వయసు కూడా కలిసివచ్చిందని చెబుతున్నారు. దీర్ఘ కాల ప్రయోజనాల ద్రుష్ట్యా మాధవ్ కి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. దీంతో రేపు మాధవ్ ఎన్నిక లాంఛనమే అంటున్నారు.