Begin typing your search above and press return to search.

పురంధేశ్వరికి డిప్యూటీ స్పీకర్ ఇస్తారా ?

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి భర్తీ అయిపోయింది. ఎంతో కాలంగా దీని మీద ఊహాగానాలు ప్రచారాలు చాలానే జరిగాయి.

By:  Tupaki Desk   |   1 July 2025 9:15 AM IST
పురంధేశ్వరికి డిప్యూటీ స్పీకర్ ఇస్తారా ?
X

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి భర్తీ అయిపోయింది. ఎంతో కాలంగా దీని మీద ఊహాగానాలు ప్రచారాలు చాలానే జరిగాయి. ఎవరికి తోచినట్లుగా వారు పుకార్లు వ్యాప్తి చేశారు. చాలా పేర్లు అయితే చర్చకు వచ్చాయి. అయితే బీజేపీ జాతీయ నాయకత్వం ఎవరిని అనుకుందో వారికే పట్టం కట్టింది. ముఖ్యంగా విధేయతకే అగ్ర తాంబూలం అని చాటి చెప్పింది.

ఆ విధంగా చూస్తే బీజేపీ నుంచి ఏపీ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఎన్నికయ్యారు. ఆయన కచ్చితంగా రెండేళ్ళ పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ఇక ఈ రోజుదాకా ఆ పార్టీలో కీలక పదవిని నిర్వహించిన పురంధేశ్వరి ఇపుడు మాజీ అయిపోయారు. అయితే ఆమె రాజమహేంద్రవరం ఎంపీగా ఉన్నారు.

నిజానికి ఆమె గత ఏడాది ఎంపీగా గెలిచిన వెంటనే కేంద్ర మంత్రి అవుతారు అని అంతా అనుకున్నారు. ఆమె యూపీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కీలక శాఖలను చూశారు. దాంతో ఆమెకు ఉన్న అనుభవం ఆమె విద్యార్హతలు ఎన్టీఆర్ కుమార్తె కావడం వెనక బలమైన సామాజిక వర్గం అన్నీ ఉండటంతో ఆమెకు కేంద్ర మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు.

ఐతే చాలా సమీకరణల వల్ల అది కుదరలేదు. టీడీపీకి రెండు మంత్రి పదవులు ఇచ్చారు. అందులో ఒకటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ కి ఇవ్వడం జరిగింది. అలా కోస్తా జిల్లాలో ఒకరికి మంత్రి పదవి ఇచ్చి అదే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వడం అంటే కుదరదు. దాంతో పురంధేశ్వరికి చాన్స్ తప్పిపోయింది.

అయినా ఆమె ఇప్పటిదాకా బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. కానీ ఇపుడు ఆ పదవి కూడా లేదు. దాంతో గత పదకొండేళ్ళుగా పార్టీ కోసం ఆమె చేస్తున్న సేవలకు ప్రతిఫలం ఏమిటి అన్న చర్చ సాగుతోంది. అయితే కేంద్ర బీజేపీ పెద్దలు ఆమెకు మంచి ప్లేస్ నే చూసి ఉంచారని అంటున్నారు.

లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. 2019 నుంచి ఆ పదవిని భర్తీ చేయలేదు. దాని మీద ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయాలని అది కాంగ్రెస్ కి సంప్రదాయం ప్రకారం ఇవ్వాలని కోరారు.

అయితే బీజేపీ మాత్రం తమ పార్టీ వారికే ఆ పదవి ఇస్తుందని అంటున్నారు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలు కాబోతున్నాయి. దాంతో పాటే డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా భర్తీ చేస్తారు అని అంటున్నారు. ఆ పదవిని పురందేశ్వరికి ఇస్తారు అన్న ప్రచారం అయితే సాగుతోంది. అదే కనుక జరిగితే ఆమె ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో కొనసాగుతారు అని అంటున్నారు.