Begin typing your search above and press return to search.

పురందేశ్వరి ఆరోపణల్లో వాస్తవ శాతం ఎంత?

ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా ఏపీ అప్పులపై స్పందించారు.

By:  Tupaki Desk   |   20 July 2023 4:59 AM GMT
పురందేశ్వరి ఆరోపణల్లో వాస్తవ శాతం ఎంత?
X

ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా ఏపీ అప్పులపై స్పందించారు. కొన్ని లెక్కలు చెప్పారు. పైగా.. వాటిలో కొన్ని అప్పులు అనధికారికమైనవిగా తేల్చే ప్రయత్నం చేశారు. దీంతో... అసలు ఏపీలో చంద్రబాబు పాలనలోనూ, ప్రస్తుత జగన్ పాలనలోనూ అప్పుల వివరాలు సవివరంగా చెబుతున్నారు పరిశీలకులు.

ఏపీపై విభజన నాటికి రూ.97వేల‌ కోట్ల భారం ఉందని.. ఐదేళ్ల టీడీపీ పాలనలో‌ రూ.2,65,365 కోట్లు అప్పు చేశారని పురందేశ్వరి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జులై వరకు నాలుగేళ్లల్లో రూ.7,14,631 కోట్లు అప్పు చేశారన్నారని ఆమె అంటున్నారు. దీంతో కాకి లెక్కలు కాదు కాగ్ లెక్కలు చూడంటి అనే కామెంట్ తెరపైకి వస్తోంది.

అవును... ఏపీ సర్కార్ పై పురందేశ్వరి చేసిన అప్పుల ఆరోపణల్లో వాస్తవశాతం ఎంత, అసత్యాలు ఎన్ని అనే విషయాన్ని ఆరా తీస్తే… అందుకు అందిన వివరాలు మరోలా ఉన్నాయి! ఆసలు పురందేశ్వరి చెప్పిన అప్పుల లెక్కలు, చేసిన ఆరోపణలు వాస్తవ దూరాలని తేలింది!

రాష్ట్ర విభజననాటికి ఉన్న అప్పు పురందేశ్వరి చెబుతున్నట్లు రూ.97వేల‌ కోట్లు కాదు... ఆ మొత్తం సుమారు రూ.1,32,079 కోట్లు! ఇక టిడిపి దిగిపోయేనాటికి ఆ అప్పు రూ. 3,31,054 కోట్లకు పెరిగింది. అంటే... చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అప్పుల వార్షిక పెరుగుదల 20.17శాతం అన్నమాట. ఈ వాస్తవ విషయాలను పురందేశ్వరి మరిచారనేది వైసీపీ నుంచి వస్తోన్న అభ్యంతరం!

ఇదే క్రమంలో... జగన్ పాలనలో ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న అప్పు 5,87,317 కోట్లు. అంటే... జగన్ పాలనలో అప్పుల వార్షిక పెరుగుదల 16.13 శాతం! చంద్రబాబు అప్పుల పెరుగుదలతో పోలిస్తే ఇది నాలుగుశాతం తక్కువే! ఈ విషయాలను జగన్ సర్కార్ పై అప్పుల విమర్శలు చేస్తున్న నేతలు గమనించాలనేది అధికారపార్టీ నుంచి వస్తోన్న సూచన!

ఇక ప్రభుత్వ రంగ సంస్థల అప్పుల విషయంలోనూ చంద్రబాబు సర్కార్ పీక్స్ అని తెలుస్తుంది. రాష్ట్ర విభజననాటికి ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు రూ. 1,53,346 కోట్లు కాగా... టిడిపి దిగిపోయేనాటికి ఉన్న అప్పులు రూ. 4,12,288 కోట్లు. అంటే... వార్షిక పెరుగుదల 21.87 శాతం అన్నమాట! ఇక 2023 మార్చి నాటికి అప్పులు రూ.6,51,789 కోట్లు!

ఇదే విషయాలను కాగ్ తెలుపుతుందని అంటున్నారు పరిశీలకులు. అంటే... టీడీపీ పాలనతో పోలిస్తే సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు తక్కువే అనేది కాగ్ నివేధిక. అదే సమయంలో మూలధన వ్యయం చాలా ఎక్కువ అని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోందని తెలుస్తోంది.

చంద్రబాబు హయాంలో ఐదేళ్ళలో రూ.76,139 కోట్లు ఖర్చు చేశారు. అంటే సరాసరి ఏడాదికి రూ.15,225 కోట్లు అన్నమాట. కాగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గత నాలుగేళ్లలోనే రూ.75,411 కోట్లు ఖర్చు చేశారు. అంటే సరాసరి ఏడాదికి రూ.18,852 కోట్లు! అంటే... సామాజిక ఆస్తుల పెంపునకు జగన్ చేసిన ఖర్చు చంద్రబాబు పాలనలో కంటే ఎక్కువ!

ఇదే సమయంలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగాలేదన్ని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. దీంతో... రోడ్లకోసం ఏ ప్రభుత్వం ఎంతెంత ఖర్చు పెట్టిందనే లెక్కలు బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగా... టిడిపి జమానాలో రోడ్లకు పెట్టిన ఖర్చు రూ.3,160 కోట్లు కాగా... జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నాలుగేళ్లలో రోడ్లకు పెట్టిన ఖర్చు రూ.4,493 కోట్లు అని తెలుస్తుంది.

ఇదే క్రమంలో... ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడం లేదు అనేది పురందేశ్వరి ఏపీ సర్కార్ పై చేసిన మరో ఆరోపణ!. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... బిజెపి పాలనలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జీతాల బిల్లు రూ.23,997 కోట్లు కాగా... గుజరాత్ లో జీతాల బిల్లు రూ.7,789 కోట్లు!! అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ జీతాల బిల్లు రూ.24,681 కోట్లు!

ఇదే సందర్భంలో... చంద్రబాబు దిగిపోయేనాటికి 2018–19లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు రూ.53,811 కోట్లు ఖర్చు చేయగా... 2020-21లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు రూ.66,470 కోట్లు... ఈ విషయాలు మరిచిపోతున్నారు బీజేపీ నేతలు!

ఇదే సమయంలో చంద్రబాబు వదిలేసి వెళ్లిన జెన్-కో బిల్లులు, కాంట్రాక్టర్ల బిల్లులతో పాటు మరికొన్ని బకాయిలను జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉందని తెలుస్తుంది. ఇదే క్రమంలో... వివిధ పథకాల ద్వారా నేరుగా రూ.2.20 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లోకి జమచేస్తుంది జగన్ సర్కార్.

ఇదే సమయంలో కరోనా వంటి కష్టకాలంలో.. రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిన సమయంలో కూడా ఎక్కడా ఏ పథకమూ ఆగలేదు.. ఏ వర్గమూ ఇబ్బంది పడలేదు. ఈ విషయాలు పురందేశ్వరికి తెలియనివి కాకపోవచ్చు! అయినప్పటికీ కొత్త పోస్టు లోకి వచ్చినందుకు కొత్త అసత్యాలు చెప్పాలని భావించారో ఏమో కానీ... వాస్తవాలు మరిచారని మాత్రం తెలుస్తుంది. ఫలితంగా... కాగ్ లెక్కలు అంత స్పష్టంగా ఉండగా.. కాకిలెక్కలు తెరపైకి తెచ్చారని స్పష్టమవుతుంది!