20 శాతం కోటానా.. వాటానా? బీజేపీ నేతల వ్యూహమేంటి?
ఏపీ బీజేపీ నాయకులు.. ఇటీవల కాలంలో కోటా-వాటా అంటూ.. కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. గత ఎన్నిక ల సమయంలో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 7 July 2025 6:00 AM ISTఏపీ బీజేపీ నాయకులు.. ఇటీవల కాలంలో కోటా-వాటా అంటూ.. కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. గత ఎన్నిక ల సమయంలో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిగా విజయం దక్కించుకున్నాయి. ఈ క్రమంలో నామినేటెడ్ పదవుల నుంచి మంత్రి వర్గంలో సీట్ల వరకు కూడా చంద్రబాబు 5 శాతం మేరకు కమల నాథులకు ముట్టచెబుతున్నారు. ఎప్పుడు ఏ పంపకాలు జరిగినా.. 5 శాతం చొప్పున పదవులు వారికి ఇస్తున్నారు.
కానీ.. ఇది తమకు చాలదని.. అసలు వాటాలేంటని.. విశాఖ ఉత్తరం నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు బహిరంగ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈయన ఒక్కరే కాదు.. రాష్ట్ర బీజేపీలో ఎమ్మెల్యేలు ఆది నారాయణరెడ్డి, కామినేని శ్రీనివాస్ వంటిబలమైన నాయకులు కూడా.. వాటాల విషయంపై అసంతృప్తితోనే ఉన్నారు. కానీ.. ఒకరిద్దరు మాత్రమే బయట పడుతున్నారు. మిగిలిన వారు సైలెంట్‌గా ఉన్నా.. తీవ్రంగా రగులుతున్నారన్నది వాస్తవం.
అయితే.. నిన్న మొన్నటి వరకు.. దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర పార్టీ చీఫ్‌గా ఉన్న నేపథ్యంలో వారు పెదవి విప్పలేదు.కానీ, ఇప్పుడు ఆర్ ఎస్ ఎస్‌తో అనుబంధం ఉన్న మాధవ్ పార్టీ పగ్గాలు చేపట్టాక.. తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇక, పైకి వారు ఇలా వాటా కోటా.. అంటున్నా.. అంతర్గతంగా మాత్రం.. అసలు పదవులు వారికే కావాలన్నది అసలు రహస్యం. విష్ణు కుమార్ రాజు సుదీర్ఘకాలంగా బీజేపీలో ఉన్నారు. ఆయన మంత్రిపదవిని కోరుకుంటున్నారు.
కానీ.. ఇప్పటి వరకు విష్ణును ఆ పదవి వరించలేదు. ఇక, గతంలో మంత్రిగా చేసిన కామినేని శ్రీనివాసరావు ప్రస్తుతం కైకలూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా మంత్రివర్గంలో చోటు కోసం.. తీవ్రంగా ప్రయ త్నాలు చేస్తున్నారు. అలానే జమ్మలమడుగు ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నాయకుడు ఆది నారాయణరెడ్డి కూడా.. మంత్రి పీఠంపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ, వీరికి అవకాశం దక్కడం లేదు. ఈ క్రమంలో కనీసం వాటా.. కోటా.. అంటూ.. కొత్త రచ్చ రేపితే.. అప్పుడైనా తమ ఆశలు నెరవేరుతాయేమోనన్నది వారి ఎత్తుగడ. అందుకే.. ఇటీవల కాలంలో వారు 20 శాతం వాటాల పేరుతో రాజకీయాలు ముమ్మరం చేశారు. మరి ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.