Begin typing your search above and press return to search.

భూ బదిలీ యుద్ధానికి ఫుల్ స్టాప్.. చంద్రబాబు ప్రభుత్వ కీలక నిర్ణయం

ఏపీలో భూముల కొనుగోలు, యాజమాన్య హక్కుల బదిలీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   2 Aug 2025 12:10 PM IST
భూ బదిలీ యుద్ధానికి ఫుల్ స్టాప్.. చంద్రబాబు ప్రభుత్వ కీలక నిర్ణయం
X

ఏపీలో భూముల కొనుగోలు, యాజమాన్య హక్కుల బదిలీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో భూమి రిజిస్ట్రేషన్లకు గంటల కొద్ది వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. క్రయ, విక్రయాల కోసం రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద పడిగాపులు కాయాల్సివచ్చేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్ధతికి స్వస్తి పలికింది. స్లాట్ విధానం అమలులోకి తీసుకువచ్చి ఏ రిజిస్ట్రేషన్ అయినా పది నిమిషాల్లో జరిగిపోయేలా చర్యలు తీసుకుంది. ఇక రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత భూముల మ్యుటేషన్ కు ఎక్కువ సమయం పడుతుందని ప్రభుత్వానికి తాజాగా రిపోర్టులు రావడంతో ఆ సమస్యను పరిష్కరిస్తూ తాజాగా ఆదేశాలిచ్చింది.

భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవాంతరాలను అధిగమించేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వం భూముల మ్యూటేషన్ ప్రక్రియలో జరిగే జాప్యం నివారించడానికి కూడా చంద్రబాబు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఇకపై రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ అయిన రోజే ఆటో మ్యుటేషన్ జరిగే విధానానికి చంద్రబాబు సర్కార్ నాంది పలికింది. నేటి నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. గతంలో అయితే ప్రాపర్టీ కొన్నామన్న సంతోషం కూడా జనానికి ఉండేది కాదు.

అమ్మిన వారి పేరు బదులు కొన్నవారి పేరు మ్యుటేషన్ కావడానికి వీఆర్వో సంబంధిత ఉద్యోగుల చుట్టూ జనం తిరగాల్సివచ్చేది. ఆస్తి పన్ను కట్టాలంటే పేరు మార్పు కాకపోవడం అడ్డంకిగా మారింది. దానికి తోడు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఇకపై ఆ కష్టాలకు చెక్ పడినట్లైంది. అయితే రిజిస్ట్రేషన్ సమయానికి ఆ ప్రాపర్టీకి సంబంధించిన పన్ను చెల్లించాల్సివుంటే మాత్రం మ్యుటేషన్ చార్జీలతో పాలు కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఆటో మ్యుటేషన్ జరగడం వల్ల అక్రమ రిజిస్ట్రేషన్ లకు కూడా అడ్డుకట్ట వేసినట్లే అంటున్నారు.