Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేల జీతాలు.. ఎథిక్స్ కమిటీలో ఇంట్రెస్టింగ్ టాపిక్

వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తప్పిస్తే, మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   7 Jan 2026 6:30 PM IST
వైసీపీ ఎమ్మెల్యేల జీతాలు.. ఎథిక్స్ కమిటీలో ఇంట్రెస్టింగ్ టాపిక్
X

ఏపీలో అధికార, విపక్షాల మధ్య రాజకీయాలు మరోసారి వేడెక్కేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేల జీతభత్యాల విషయంలో పెద్ద రగడ జరిగే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది జీతాలు తీసుకోవడాన్ని కూటమి నేతలు తప్పుపడుతున్నారు. ఈ విషయంలో వైసీపీ ఎమ్మెల్యేల నైతికతను ప్రశ్నిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గతంలో సీరియస్ కామెంట్లు చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఇప్పటికే ఒకసారి సమావేశమై చర్చించిన ఎథిక్స్ కమిటీ సభ్యులు బుధవారం మరోసారి సమావేశమయ్యారని కథనాలు వస్తున్నాయి.

వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తప్పిస్తే, మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ విషయమై అసెంబ్లీలోనే గతంలో మాట్లాడుతూ వైసీపీ సభ్యులు సభకు రాకుండా, దొంగచాటుగా హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు చేయని ప్రభుత్వ అధికారులు జీతాలు చెల్లిస్తామా? ఎవరైనా విధులకు హాజరు కాకపోతే జీతాలు ఆపేస్తాం కదా? మరి అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు గతంలో ప్రశ్నించారు.

అంతేకాకుండా ఈ విషయాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని ఎథిక్స్ కమిటీకి ఆదేశించారు. దీంతో వైసీపీ సభ్యుల సంతకాలను ఎథిక్స్ కమిటీ పరిశీలించిందని తాజాగా ప్రచారం జరుగుతోంది. మొత్తం పది మంది సభ్యుల్లో ఆరుగురు ఎమ్మెల్యేల తీరుపై చర్చించినట్లు చెబుతున్నారు. దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడికి నివేదిక సమర్పిస్తారని అంటున్నారు. సభకు హాజరుకాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవచ్చా? ఎమ్మెల్యేలకు జీతాలు నిలిపివేసే అధికారం ఉందా? ఉంటే ఎవరికి ఉంది? ఎలా నిలిపివేయాలన్న అంశాలను ఎథిక్స్ కమిటీ పరిశీలించినట్లుగా చెబుతున్నారు.

ఎథిక్స్ కమిటీ సిఫార్సులతో స్పీకర్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే జీతాల చెల్లింపు నిలుపుదల చేస్తే రాజకీయ వివాదం చెలరేగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దేశ రాజకీయాలను ప్రభావితం చేయొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే సభకు హాజరుకాని ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వం గతంలో హెచ్చరికలు జారీ చేసింది. వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి డుమ్మా కొడితే సభ్యుల సభ్యత్వం ఆటోమెటిక్ గా రద్దు అవుతుందని నిబంధనలు ఉన్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి రామని తెగేసి చెబుతున్న వైసీపీ.. అనర్హత వేటు ఎలా వేస్తారో చూస్తామంటూ సవాల్ విసిరింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎథిక్స్ కమిటీ సమావేశంపైనా వైసీపీ స్పందన ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.