Begin typing your search above and press return to search.

ఇదేం తాడేపల్లి ప్యాలెస్ అనుకున్నారా? మార్షల్స్ ‘అతి’పై లోకేశ్ సీరియస్

ఇక వారి ప్రవర్తనను గమనించిన మంత్రి నారా లోకేశ్ సీరియస్ వార్నింగు ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపాయి.

By:  Tupaki Desk   |   19 Sept 2025 4:50 PM IST
ఇదేం తాడేపల్లి ప్యాలెస్ అనుకున్నారా? మార్షల్స్ ‘అతి’పై లోకేశ్ సీరియస్
X

ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నా కూటమి ఎమ్మెల్యేలు అంతా చర్చా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అందరూ అధికార పక్షమే అయినప్పటికీ అసెంబ్లీ భద్రత చూసే మార్షల్స్ అతి చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఇక వారి ప్రవర్తనను గమనించిన మంత్రి నారా లోకేశ్ సీరియస్ వార్నింగు ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపాయి.

గురువారం సాయంత్రం అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి లోకేశ్ చాంబర్ వద్ద సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడుతుండగా, మార్షల్స్ అక్కడకు వచ్చి, ఎవరూ అక్కడ ఉండకూడదని హడావుడి చేశారు. మీడియాను దూరంగా పంపే ప్రయత్నం చేయడమే కాకుండా సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల్లను చేతితో నెట్టేశారు. మీడియాతో మాట్లాడేందుకు అనుమతి లేదంటూ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఇదంతా తన చాంబర్ నుంచి గమనించిన మంత్రి లోకేశ్ వెంటనే బయటకు వచ్చి మార్షల్స్ కు క్లాసు పీకారు.

సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల్ల నరేంద్రకు గౌరవం ఇవ్వకుండా మార్షల్స్ వ్యవహరించడాన్ని తప్పుబట్టిన మంత్రి లోకేశ్.. ఇంకా మనం వైసీపీ అరాచక పాలనలో ఉన్నామని అనుకుంటున్నారా? లేక ఇదేమైనా తాడేపల్లి ప్యాలెస్సా అంటూ మార్షల్స్ ను మందలించారు. మార్షల్స్ డ్యూటీని గుర్తుచేస్తూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బయట వ్యక్తులు రాకుండా చూసుకోవాలి కానీ, ఎమ్మెల్యేలు, మీడియాను చెదరగొడితే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను నియంత్రించడం మీ పని కాదు.. గీత దాటొద్దు అంటూ మార్షల్స్ కు మంత్రి లోకేశ్ క్లాసు తీసుకున్నారు.

కాగా, అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పుడు స్పీకర్ ఆదేశాలతో సభ్యులను బయటకు పంపేందుకు మార్షల్స్ ను వినియోగిస్తారు. సభా కార్యక్రమాలను అడ్డుకునే విపక్షాన్ని దారికి తెచ్చుకోడానికి అవసరమైతే విపక్ష ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు పంపడానికి మార్షల్స్ ను ప్రభుత్వం వినియోగించుకుంటుంది. అయితే ఇప్పుడు అసెంబ్లీకి విపక్షం నుంచి ఎవరూ రావడం లేదు. సభ మొత్తం అధికార పక్షమే ఉండగా, మార్షల్స్ కు పెద్దగా పనిలేకపోయింది. అయితే కొందరు మార్షల్స్ అతి చేయడం వల్ల ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం మంత్రి లోకేశ్ చాంబర్ వద్దే ఈ అతి చోటు చేసుకోవడంతో యువనేత చీవాట్లు పెట్టడం ఎమ్మెల్యే మధ్య చర్చకు వచ్చింది.