ఏపీ శాసన మండలిలో `పొలిటికల్ పూనకాలు`.. ఏం జరిగింది?
ఏపీ శాసన మండలిలో మంగళవారం పొలిటికల్ పూనకాలు సభను హోరెత్తించాయి. అటు మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, ఇటు వైసీపీ సభ్యులు బొత్ససత్యనారాయణ, వరుదు కళ్యాణిల మధ్య మాటల తూటాలు పేలాయి.
By: Garuda Media | 24 Sept 2025 11:44 PM ISTఏపీ శాసన మండలిలో మంగళవారం పొలిటికల్ పూనకాలు సభను హోరెత్తించాయి. అటు మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, ఇటు వైసీపీ సభ్యులు బొత్ససత్యనారాయణ, వరుదు కళ్యాణిల మధ్య మాటల తూటాలు పేలాయి. అంతేకాదు.. మరో సారి సభలో `మహిళలకు గౌరవం, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు` అనే అంశాలపై తీవ్రస్థాయిలో మాటల మంటలు చెలరే గాయి. వైసీపీ సభ్యుల మాట ఎలా ఉన్నా.. మంత్రులు ఇద్దరూ కూడా తీవ్ర ఆగ్రహంతో వ్యాఖ్యలుచేయడం.. ఒకానొక దశలో నారా లోకేష్ ఊగిపోతూ మాట్లాడడం సభలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
ఏం జరిగింది?
విశాఖపట్నం స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించే విషయం మంగళవారం మండలిలో చర్చకు వచ్చింది. తొలుత వైసీపీ సభ్యురాలు కల్యాణి ఈ విషయంపై ప్రశ్నలు గుప్పించారు. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తున్నారని, కానీ, ప్రభుత్వం అడ్డుకోలేక పోతోందని చెప్పారు. అంతేకాదు.. తమ పార్టీ పాలనలో విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా అప్పటి సీఎం జగన్ అడ్డుకునే ప్రయత్నం చేశారని, కేంద్రానికి లేఖ కూడా రాశారని తెలిపారు. అయితే.. ఈ సందర్భంగా అధికార పక్ష సభ్యులు దీటుగా స్పందించారు. విశాఖ స్టీలు ప్లాంటును ఎవరు ప్రైవేటీకరించాలని కోరుకుంటున్నారో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు.
ఈ సమయంలో మండలిలోకి వచ్చిన నారా లోకేష్.. వరుదు కల్యాణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ''విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ జరగకుండా మా నాయకుడు కేంద్రానికి లేఖ రాశారు.`` అని కల్యాణి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ``లేఖ రాసి మీరు ఏం చేశారు? ఏం పీకారు? మీరు పీకింది ఏంటి?. కనీసం ఉద్యోగుల సమస్యలను కూడా వినలేదు. ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే పోలీసులను పెట్టించారు. ఇదేనా మీరు చేసింది.'' అని నిలదీశారు. ఈ వ్యాఖ్యలు మండలిలో తీవ్ర దుమారం రేపాయి. విపక్ష నేత బొత్స సత్యనారాయణ మంత్రి నారా లోకేష్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మహిళా సభ్యురాలి పట్ల నారా లోకేష్ పరుష పదజాలం వాడారని.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో టీడీపీ వైపు నుంచి బలమైన ఎదురు దాడి జరిగింది. ``మహిళలకు అవమానం గురించి మీరే చెప్పాలి. నాడు నిండు సభలో చంద్రబాబు సతీమణిని అవమానించినప్పుడు తెలియదా? సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేసినప్పుడు తెలియదా? మహిళలకు మీరు ఎంత మాత్రం గౌరవం ఇస్తున్నారో.. మీ కుటుంబాల్లోని మహిళలను అడిగితే వారే చెబుతారు.`` అని హోం మంత్రి అనిత నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన తల్లిని దూషించారని, తన సతీమణిని దూషించారని వారు మహిళలు కాదా? అని నిప్పులు చెరిగారు. తన తల్లిని దూషించినప్పుడు ఆమె రెండు మాసాల పాటు కన్నీరు కారుస్తూనే ఉన్నారని చెప్పారు. ``అలాంటి మీరు ఇప్పుడు నన్ను తప్పుపడుతున్నారు.`` అంటూ ఊగిపోయారు. ఈ అరుపులు కేకలతో మండలి దద్దరిల్లింది.
