Begin typing your search above and press return to search.

మత్తులో ఏఎస్ఐ వీరంగం.. సీఐనే తోసేశాడుగా

బాపట్ల జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పని చేస్తున్నాడు రవికుమార్. ప్రస్తుతం ఆయన్ను చీరాల రూరల్ సీఐ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నాడు.

By:  Garuda Media   |   26 Dec 2025 11:15 AM IST
మత్తులో ఏఎస్ఐ వీరంగం.. సీఐనే తోసేశాడుగా
X

ఎదవ పని చేయకూడదు. అందులోనూ బాధ్యతతో వ్యవహరించాల్సిన రంగాల్లో ఉన్న వారు హద్దుల గీతను అసలే దాటకూడదు. అయితే.. ఇలాంటివేమీ తనకు పట్టనట్లుగా వ్యవహరిస్తూ రచ్చ చేసిన ఒక ఏఎస్ఐ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో నడి రోడ్డు మీద రచ్చ చేయటమే కాదు.. సర్దిచెబుతున్న సీఐను సైతం బలుపుతో నెట్టేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పోలీస్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలోని బాపట్ల జిల్లా పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాపట్ల జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పని చేస్తున్నాడు రవికుమార్. ప్రస్తుతం ఆయన్ను చీరాల రూరల్ సీఐ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నాడు. క్రిస్మస్ నేపథ్యంలో చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్ సెంటరీన్ లూథరన్ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. తన కారులో ఏఎస్ఐ ఆ ప్రాంతానికి వెళ్లిన సందర్భంలో అతని కారు పోలీస్ రక్షక్ జీపునకు తగిలింది. దీంతో రక్షక్ వాహన డ్రైవర్ ఏఎస్ఐను ప్రశ్నించాడు.

దీంతో రెచ్చిపోయిన ఏఎస్ఐ డ్రైవర్ తో గొడవకు దిగారు. ఇది కాస్తా వాగ్వాదంగా మారింది. సమాచారం అందుకున్న వన్ టౌన్ సీఐ సుబ్బారావు ఘటనాస్థలానికి చేరుకొని ఏఎస్ఐకు సర్దిచెప్పబోయాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను హంగామా చేయటంతో పాటు.. సీఐ.. సిబ్బందిని తోసేశాడు. దీంతో.. పోలీసులు అతడ్ని కొంత దూరం లాక్కెళ్లి ఆ తర్వాత వదిలేశారు.

దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఏఎస్ఐను వీఆర్ కు పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదంతంపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారి ఇలా తాగేసి రోడ్ల మీద రచ్చ చేయటం ఏమిటి? అన్నదిప్పుడు చర్చగా మారింది.