ఏపీలో నెలాఖరుకు 'సూపర్ 6' పండుగే.. బాబు కీలక నిర్ణయం!
ఇక, జూన్ 20నే అన్నదాత సుఖీభవ పథకాన్ని అందిస్తామని కొన్నాళ్ల కిందట సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చెప్పారు.
By: Tupaki Desk | 22 Jun 2025 8:30 AMఏపీలో మరో సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ సిద్ధం చేశారు. శనివారం ఆయన దీనికి సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ నెలాఖరు నాటికి రైతులకు మేలు చేసేలా నిర్ణయం ఉండనుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో `అన్నదాత సుఖీభవ` ఒకటి. రైతులకు ఏటా 20 వేల రూపాయల మేరకు పెట్టుబడి సాయంఅందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిపై అన్నాదాతలు ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా? అని ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి గత ఏడాదే ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. అయితే.. కొన్నికారణాలతో వాయిదా పడింది.
ఇక, జూన్ 20నే అన్నదాత సుఖీభవ పథకాన్ని అందిస్తామని కొన్నాళ్ల కిందట సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చెప్పారు. మహానాడులోనూ దీనిపై ప్రకటన చేశారు. కానీ.. జూన్ 20న కూడా ఇది అమలు కాలేదు. దీంతో రైతుల్లో నిరాశ వ్యక్తమైంది. మరోవైపు.. లబ్ధి దారుల జాబితాల్లో 8 లక్షల మంది రైతులకు కోత పెట్టారన్న వాదన తెరమీదికి వచ్చింది. వీటన్నింటినీ పరిశీలించిన సీఎం చంద్రబాబు అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకాన్ని అమలు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే.. మరోసారి వెరిఫై చేయాలని సూచించారు.
ఇక, ఈ పథకాన్ని జూన్ నెలాఖరులో అమలు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు అంతర్గత సమావేశంలో అధికారులకు తెలిపా రు. ఈ పథకం కింద రైతులకు మూడు విడతల్లో నిధులు మంజూరు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనను దీనికి అనుసంధానిస్తూ.. రాష్ట్రంలో అమలు చేస్తారు. దీనికింద కేంద్రం రూ.2000 చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో వేయనుంది. అదేసమయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా నిధులను వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఇక, కేంద్రం ఈ నెల ఆఖరు నాటికి పీఎం కిసాన్‌ను అమలు చేయనున్నట్టు రాష్ట్రానికి సమాచారం అందింది.
దీంతో అదేరోజు రాష్ట్రంలోనూ రైతులకు నిధులు విడుదల చేయనున్నారు. కాగా.. వైసీపీ గతంలో ఏటా 13 వేల చొప్పున రైతులకు ఇస్తామని చెప్పి.. కేంద్రం ఇచ్చిన రూ.6000(మూడు విడతల్లో)లను మినహాయించి.. మిగిలిన ఏడు వేలు కలిపి వేసింది. ఇప్పుడు కూడా అదే పంథాలో కూటమి సర్కారు రైతులకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. అంటే.. కేంద్రం ఇచ్చే ఆరు వేలను మినహాయించి.. ఒక్కొక్క రైతుకు వారి వారి ఖాతాల్లో రూ.14 వేల చొప్పున ఖాతాల్లో వేయనుంది. తొలి విడతలో ఏడు వేలు, రెండో విడతలో ఏడు వేలు.. చివరి విడతలో ఆరు వేల చొప్పున ఖాతాల్లో నిధులు జమచేయనున్నారు.