Begin typing your search above and press return to search.

అతి పెద్ద అన్న యాగం...8.80 కోట్ల మంది తిన్నారు !

ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టడం కన్నా పుణ్యం లేదని పురాణాలు చెబుతున్నాయి. పాలనలో సంక్షేమానికి పెద్ద పీట వేయడానికి ఈ సూత్రమే కారణం.

By:  Satya P   |   16 April 2026 12:33 AM IST
అతి పెద్ద అన్న యాగం...8.80 కోట్ల మంది తిన్నారు !
X

ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టడం కన్నా పుణ్యం లేదని పురాణాలు చెబుతున్నాయి. పాలనలో సంక్షేమానికి పెద్ద పీట వేయడానికి ఈ సూత్రమే కారణం. ఎంత మందికి ఎన్ని రకాలుగా సదుపాయాలు అవకాశాలు కలిగించినా నాలుగు వేళ్ళూ నోట్లోకి వెళ్లని వారు ఎంతో మంది ఇంకా ఉన్నారు. అలాంటి అభాగ్యుల కోసం లక్షల కోట్ల బడ్జెట్ తోq ప్రభుత్వాలు నడిపే పాలకులు ఎంతో కొంత ఖర్చు పెడితే జనాలు ఎంతగానో సంతృప్తి చెందుతారు. మిగిలిన పధకాలు ఆర్ధికంగా లబ్ది కలిగించవచ్చు కానీ భోజనం నేరుగా పేదలకు అందించే పధకం మాత్రం ఎంతో గొప్పది అని చెప్పాల్సిందే. మానవత్వంతో కూడుకున్నది కూడా.

కోట్లలోనే భోజనాలు :

ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించారు. ఆ విధంగా చూస్తే గడచిన 21 నెలల్లో అన్నక్యాంటీన్లలో 8.80 కోట్ల భోజనాలు చేశారు. ఇప్పటి వరకూ అన్నక్యాంటీన్ సబ్సిడీ కోసం కూటమి ప్రభుత్వం 243 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసింది. కేవలం అయిదు రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం అందించడం ద్వారా అన్నా క్యాంటీన్లు పేదల ఆకలి తీరుస్తున్నాయి. ఆకలి తీరితేనే నిజమైన అభివృద్ధి అన్న సూత్రాన్ని కూటమి ప్రభుత్వం నమ్ముతోంది. అందుకే అన్నార్తులకు అండగా అన్న క్యాంటీన్లని నిర్వహిస్తోంది. ఆ విధంగా ఆహార భద్రత కోసమే కృషి చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చాంద్రబాబు చెబుతున్నారు.

269 కి చేరిన అన్న క్యాంటీన్లు :

ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో కొత్తగా 62 క్యాంటీన్లను తాజాగా కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో ఏపీలో మొత్తం అన్న క్యాంటీన్ల సంఖ్య 269 కి చేరింది. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే నా రాజకీయం అని ఎన్టీఆర్ అప్పట్లో కిలో రెండు రూపాయలకే బియ్యం ఇచ్చి ఆహార భద్రత పథకానికి నాంది పలికారని ఆయన గుర్తు చేశారు. నాటి రెండు రూపాయల కిలో బియ్యం నుంచి నేటి అన్నా క్యాంటీన్ల వరకు ఆహార భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఇక పట్టణాల్లో 204, గ్రామాలలో 65 కలిపి ఈ సంఖ్య 269కి పెరిగిందని ఆయన చెప్పారు. త్వరలో మరో 5 క్యాంటీన్లు సిద్ధం అవుతున్నాయని బాబు తెలిపారు.

సగటున రోజుకు వేయి మంది :

ఇదిలా ఉంటే ఒక్కో అన్నా క్యాంటీన్‌లో రోజుకు సగటున ఒక వేయి 13 మంది ఆహారాన్ని తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఒక రోజు ఒక అన్నా క్యాంటీన్ నిర్వహణ కోసం 26,250 రూపాయలు ఖర్చు అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు 2.10 లక్షల మంది భోజనాలు చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. అలా దీనికోసం రోజుకు ప్రభుత్వానికి 54 లక్షల రూపాయలకు పైగా వ్యయం అవుతోంది. ఇప్పుడు కొత్తగా పెట్టిన 62 గ్రామీణ అన్న కాంటీన్లతో కలుపుకుంటే రోజుకు మరో 18 లక్షలు అదనం అవుతుంది. అలా ఏడాదికి 58 కోట్లు అవుతుందని లెక్క వేస్తున్నారు.