225 మంది ఎమ్మెల్యేలకూ క్వార్టర్స్ కట్టిస్తున్న బాబు
అందుకే చంద్రబాబు చాలా ఎక్కువ మందినే అకామిడేషన్ ఉండేలా నిర్మాణం చేయిస్తున్నారు అంటున్నారు.
By: Tupaki Desk | 10 July 2025 8:30 AM ISTఏపీలో ఉన్నది 175 మందే కదా మరి 225 మంది ఏమిటి అని అనుకునేరు. ఆ నంబర్ కి చేరుకోవడానికి ఎంత కాలమూ పట్టదు అని అంటున్నారు. జస్ట్ రెండేళ్ళు ఆగితే ఏపీలో 225 మంది ఎమ్మెల్యేలు అవడం ఖాయమని చెబుతున్నారు. ఆ తరువాత భవిష్యత్తులో ఈ నంబర్ ఇంకా పెరగవచ్చు. అందుకే అన్నీ ఆలోచించి అమరావతిలో ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల క్వార్టర్లను ప్రస్తుతం ఉన్న నంబర్ కంటే అధికంగా కట్టిస్తున్నారుట.
ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ అన్నది అందరికీ తెలిసిందే. ఆయన మరో పాతికేళ్ళ ముందు చూపుతో ఆలోచిస్తారు అమరావతిని ప్రపంచ రాజధానిగా తీర్చిదిద్దుతున్న్నారు. కనీసంగా చూస్తే మరో వందేళ్ళ అవసరాలకు సరిపడా రాజధాని నగరం నిర్మాణం అవుతుంది అని చెబుతున్నారు.
ఈ వందేళ్ళలో ఎన్నో జరగవచ్చు అసెంబ్లీ మెంబర్స్ కూడా ఇప్పటి నంబర్ కి నాలుగైదు రెట్లు కావచ్చు. అందుకే చంద్రబాబు చాలా ఎక్కువ మందినే అకామిడేషన్ ఉండేలా నిర్మాణం చేయిస్తున్నారు అంటున్నారు. అంతే కాదు వాటిని అత్యాధునికంగా కూడా ఉండేలా చూస్తున్నారు. అదే సమయంలో అసెంబ్లీలో సీట్ల సంఖ్యను భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా ఉండేలా చూస్తున్నారుట.
అలా అమరావతిని భవిష్యత్తు తరాలు చూసి గర్వించేలా చంద్రబాబు మార్క్ మాస్టర్ ప్లాన్ తో డిజైన్ చేయిస్తున్నారు అని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని వినూత్నంగా నివాస సముదాయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వసతి సౌకర్యాలు కల్పించే క్వార్టర్లలో స్విమ్మింగ్ పూల్, ఆసుపత్రి, క్లబ్ హౌస్ వంటి ఆధునిక సౌకర్యాలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
అదే విధంగా సోలార్ ఎనర్జీ వినియోగం, గ్రౌండ్ వాటర్ రీచార్జ్, వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ వంటి అంశాల్లో మెరుగైన వసతులు కల్పించాలని చూస్తున్నారు. ఇక చూస్తే కనుక మొత్తం 12 టవర్లలో నిర్మిస్తున్న 288 క్వార్టర్లు ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.
అలా వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరావతిలోని క్వార్టర్స్‌లోనే ఉంటారని చెబుతున్నారు. మొత్తానికి అమరావతిలో మొదట కొలువు ఉండేవి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రులు వారి కుటుంబాలు అని చెబుతున్నారు. మొత్తం మీద అమరావతి రాజధాని కళ కట్టేందుకు మరో ఆరు నెలల సమయం పట్టవచ్చు అని అంటున్నారు.
