Begin typing your search above and press return to search.

వీధి కుక్కల లెక్క చూస్తే షాక్ ....ఏపీ సర్కార్ అలెర్ట్

ఇదిలా ఉంటే ఏపీలో వీధి కుక్కల జనాభాను నియంత్రించడానికి కుక్క కాటు ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యానికి ప్రమాదంగా మారకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

By:  Satya P   |   17 Nov 2025 9:47 AM IST
వీధి కుక్కల లెక్క చూస్తే  షాక్ ....ఏపీ సర్కార్ అలెర్ట్
X

కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నది పాత సామెత. చెప్పు దెబ్బ కొడితే బెదిరే రకాలు ఈ రోజున లేవు సరికదా కుక్క కాటేస్తే ఏకంగా మనిషి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. పట్టణం పల్లె మహా నగరాలు అన్న తేడా లేకుండా కుక్కలు అన్ని చోట్లా ఉంటున్నాయి. కరచి చంపేస్తున్నాయి. వాటి విషయంలో జంతు ప్రేమికులు వెనకేసుకుని రావచ్చు కానీ బాధితులు మాత్రం కోర్టులకు ఎక్కుతున్నారు. ఈ నేపధ్యంలో తమ వద్దకు వచ్చిన పిటిషన్లకు విచారించిన సుప్రీంకోర్టు తాజాగా వీధి కుక్కల విషయంలో తీర్పు చెప్పింది, అవి కనిపిస్తే వాటిని తీసుకుని వెళ్ళి షెల్టర్లకు తరలించాలని కూడా ఆదేశించింది. అన్ని రాష్ట్రాలకు ఈ ఆదేశాలను అమలు చేయాలని కోరింది.

యాక్షన్ ప్లాన్ రెడీ :

ఇదిలా ఉంటే ఏపీలో వీధి కుక్కల జనాభాను నియంత్రించడానికి కుక్క కాటు ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యానికి ప్రమాదంగా మారకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఒక పద్ధతి ప్రకారం ఈ విషయంలో వ్యవహరిస్తోంది. కుక్కల జనాభా నియంత్రణ తో పాటుగా యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ పై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పట్టణ స్థానిక సంస్థలలో వీధి కుక్కల బెడదను పరిష్కరించడానికి కీలకమైన ఆదేశాలతో యాక్షన్ ప్లాన్ ని ప్రకటించింది. తాజాగా నవంబర్ 7 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కఠినంగా పాటించాల్సిన మార్గదర్శకాలను అన్ని మున్సిపల్ కమిషనర్లకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు

ఇది బిగ్ నంబర్ గానే :

ఏపీలోని అన్ని పట్టణాలలో వీధి కుక్కల సంఖ్య చూస్తే కనుక షాక్ తినాల్సిందే అని అంటున్నారు. ఇక్కడ వీధి కుక్కల జనాభా సుమారు 5.15 లక్షలుగా అంచనా వేస్తున్నారు. ఒక విధంగా చూస్తే ఇది బిగ్ నంబర్ గానే ఉంది. ఇంత పెద్ద సంఖ్యలో కుక్కలు కేవలం పట్టణ ప్రాంతాలలో ఉంటున్నాయి. ఇక గ్రామాలు పల్లెలు చూస్తే ఇంకా ఎక్కువ నంబరే ఉండొచ్చు. అయితే మునిసిపాలిటీలలో కుక్కలను నియంత్రించే విధానంలో భాగంగా ఇప్పటికే మూడు లక్షల 61 వేల వీధి కుక్కలకు శస్త్రచికిత్స ద్వారా సంతాన నిరోధకతను సాధించారు. రానున్న రోజులలో నియమాల ప్రకారం వీధి కుక్కల జనాభాను సమర్థవంతంగా నియంత్రించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని అధికారులు చెబుతున్నారు.

రేబీస్ రాకుండా "

ఇక రేబిస్ సోకిన కుక్కలను గుర్తించి అవసరమైతే వాటిని ప్రత్యేక షెల్టర్లలో ఉంచాలని అధికార యంత్రాంగం మునిసిపాలిటీలకు సూచిస్తోంది. ప్రభుత్వం ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దశలవారీగా ప్రమాదకరమైన దూకుడుగా ఉండే కుక్కల కోసం ప్రత్యేక పౌండ్లను అమలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. అలాగే అన్ని మున్సిపాలిటీలు పట్టణాలలో ఆపరేషన్ థియేటర్లు కెన్నెల్స్ వంటి మౌలిక సదుపాయాలతో ఏబీసీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 197 మంది శిక్షణ పొందిన హ్యాండ్లర్లు డాగ్ క్యాచర్లను పట్టణాలు మునిసిపాలిటీలలో ఇప్పటికే నియమించారు.

కొత్తగా సర్వే :

ఇదిలా ఉంటే కొత్తగా వీధి కుక్కల జనాభాపై సర్వే నిర్వహించాలని కూడా అధికర యంత్రంగం ఆదేశిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, కుక్కలలో సంతాన నిరోధకత కోసం వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించాలని మునిసిపాలిటీలను ఆదేశించింది. ఇక అంగన్‌వాడీలు పాఠశాలల్లో కుక్కల నుంచి రక్షించుకోవడానికి పిల్లల భద్రతను నిర్ధారించడానికి అవగాహన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తున్నారు. ఇక సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మునిసిపలిటీలలలో పాఠశాలలు, ఆసుపత్రులు, బస్ డిపోలు, రైల్వేలు క్రీడా సముదాయాలు వంటి సంస్థాగత ప్రాంతాలను గుర్తించి వాటిని కుక్కల బెడద ఏ మాత్రం లేకుండ సురక్షితం చేయాలని కూడా కమిషనర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు.