Begin typing your search above and press return to search.

వైసీపీకి టెన్షన్ పెట్టిస్తున్న ‘సీరియల్’ అరెస్టులు.. మాజీ మంత్రి విడదలకు షాక్

ఏపీ ప్రభుత్వం స్పీడు పెంచింది. కొద్ది రోజులుగా విరామమిచ్చినట్లు కనిపించిన అరెస్టుల పరంపరకు మళ్లీ తెరలేపింది.

By:  Tupaki Desk   |   24 April 2025 10:59 AM IST
AP Government Intensifies Action: Ex-Minister Rajinis Relative Arrested in ACB Case
X

ఏపీ ప్రభుత్వం స్పీడు పెంచింది. కొద్ది రోజులుగా విరామమిచ్చినట్లు కనిపించిన అరెస్టుల పరంపరకు మళ్లీ తెరలేపింది. లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడు కేసిరెడ్డి అరెస్టు తర్వాత, సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే క్రమంలో ఈ రోజు వేకువజామున మాజీ మంత్రి విడదల రజని మరది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాదులో గోపీని అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు.

వైసీపీ నేతలు, ఆ పార్టీకి అనుకూలంగా ముద్రపడిన వ్యక్తులు, అధికారుల అరెస్టులకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. వరుస అరెస్టులతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఓ వైపు మద్యం స్కాంలో ఎప్పుడు ఎవరిని జైలుకు పంపుతారనే టెన్షన్ కొనసాగుతుండగా, ఏసీబీ అధికారులు చిలకలూరిపేటకు చెందిన వైసీపీ మాజీ మంత్రి విడదల రజనిపై ఫోకస్ చేశారు. చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం ఫిర్యాదుతో మాజీ మంత్రి రజిని, ఆమె మరిది గోపి, పీఏపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రజినిపై స్టోన్ క్రషర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న రజిని తనను బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని రజినిపై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన ఏసీబీ అధికారులు అప్పట్లో విజిలెన్స్ ఎస్పీగా పనిచేసిన జాషువాను విచారించారు. ఆయన వాంగ్మూలంతో రజిని, ఆమె మరిదిపై కేసులు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఉన్న మాజీ మంత్రి రజిని మరిది గోపీని అదుపులోకి తీసుకుని విజయవాడ తరలిస్తున్నారు. అయితే ఈ కేసులో తనను బెదిరించాలని చూస్తున్నారని, కేసుల వెనుక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పుల్లారావు హస్తం ఉందని మాజీ మంత్రి రజిని ఆరోపిస్తున్నారు. కేసులకు తాను భయపడనని ప్రకటించారు. కాగా, గోపి అరెస్టుతో ఈ కేసులో ఏసీబీ పురోగతి సాధించిందని అంటున్నారు. ఇక మాజీ మంత్రి రజిని కూడా నిందితురాలుగా ఉండటంతో ఆమెనూ అరెస్టు చేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.