Begin typing your search above and press return to search.

ప్రభుత్వంపై కాదు.. అసలు బాధ్యులపై చర్యలు తీసుకోండి!

ఇదిలా ఉండగా, విరాళాల లెక్కింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) విచారణను వేగవంతం చేసింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   10 July 2026 9:00 PM IST
ప్రభుత్వంపై కాదు.. అసలు బాధ్యులపై చర్యలు తీసుకోండి!
X

అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ప్రాధాన్య‌త‌ను సంతరించుకున్నాయి. ఈ వ్యవహారంలో ఆలయ పవిత్రతను ప్రశ్నించడం లేదా ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేయడం కంటే, తప్పు చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తన తాజా సినిమా శ్రీ రామ్ భూమి షూటింగ్ కోసం అయోధ్యకు వచ్చిన అనుపమ్ ఖేర్, ముందుగా రామలల్లా, ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఆలయంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విరాళాల దొంగతనం అత్యంత దురదృష్టకరమైన ఘటనేనని పేర్కొన్నారు. అయితే, కొందరు వ్యక్తులు చేసిన తప్పును మొత్తం ఆలయ వ్యవస్థకు లేదా సనాతన ధర్మానికి ఆపాదించడం సరైన విధానం కాదని, ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని ఆ ఇంటినే నిందించకూడ‌ద‌ని, అలాగే ఆలయంలో కొందరు అక్రమాలకు పాల్పడితే, ఆలయ మహత్యం లేదా శ్రీరాముడి పట్ల ప్రజల విశ్వాసం తగ్గిపోద‌ని, తప్పు చేసిన వారిని మాత్రం చట్టం ముందు నిలబెట్టి శిక్షించాల‌ని చెప్పారు. శతాబ్దాల నిరీక్షణ తర్వాత నిర్మితమైన రామమందిర గౌరవాన్ని ఇలాంటి ఘటనలతో ముడిపెట్టడం సరికాదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, విరాళాల లెక్కింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) విచారణను వేగవంతం చేసింది. ప్రాథమిక నివేదికలో డ‌బ్బు లెక్కించే ప్రాసెస్ లో కొందరు సిబ్బంది నగదు దాచిపెట్టినట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించినట్లు వెల్లడైంది. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదవగా, వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం నిందితుల బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తూ, స్వాధీనం చేసుకున్న నగదుకు విరాళాల దొంగతనంతో సంబంధం ఉందా అనే అంశంపై లోతుగా విచారణ చేపడుతున్నాయి. విరాళాల లెక్కింపులో భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని కూడా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ కూడా పరిపాలనా సంస్కరణల దిశగా చర్యలు ప్రారంభించింది.

మొత్తానికి, అయోధ్య విరాళాల వివాదంలో అనుపమ్ ఖేర్ చేసిన కామెంట్స్ రాజకీయ విమర్శల కంటే బాధ్యులపై చర్యలకే ప్రాధాన్యం ఇవ్వాలనే మెసేజ్‌ను స్ప‌ష్టం చేస్తున్నాయి. ఆలయంపై భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా, తప్పు చేసిన వ్యక్తులను చట్టపరంగా శిక్షించడం ద్వారానే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.