Begin typing your search above and press return to search.

యాంటీ జగన్ స్లోగన్... సైనికులకు ఇదొక్కటే చాలునా...?

ఇక జనసేనలో ఉన్న నాయకులకు కూడా టీడీపీతో చెలిమికి ఒప్పించాలి. వారిని తనతో రప్పించాలి. అంటే దానికి పవన్ కనిపెట్టిన వ్యూహం యాంటీ జగన్ స్లోగన్.

By:  Tupaki Desk   |   16 Sept 2023 9:00 PM IST
యాంటీ జగన్ స్లోగన్... సైనికులకు ఇదొక్కటే చాలునా...?
X

ఏపీలో ట్రెడిషనల్ పాలిటిక్స్ దాటేసి చాలా దూరం వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఒక్క చంద్రబాబే ఇంకా ట్రెడిషనల్ పాలిటిక్స్ ని చేస్తూ వస్తున్నారు. ఆయన ఎర్లీ సెవెంటీస్ నాటి లీడర్ కాబట్టి ఆ ఒరవడిలోనే ముందుకు పోతూ ఉంటారు.

ఇక జగన్ వచ్చి పాత రాజకీయాలకు స్వస్తి అనేశారు తాను అనుకున్న దారిలోనే వెళ్ళి మరీ సీఎం సీటు పట్టేసారు. ఇపుడు పవన్ కూడా మరో రూట్లో వెళ్తున్నారు. ఆయనది కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ కాదు. అలా కనుక చేస్తే పార్టీని అట్టడుగు దాకా నిర్మించాలి. బూత్ లెవెల్ వరకూ విస్తరించి కమిటీలు వేసి సమావేశాలు పెట్టి ఎప్పటికపుడు కదం తొక్కిస్తూ సాగాలి.

అయితే పవన్ పార్టీకి ఆ ఇబ్బందులు ఏవీ లేవు, అవసరమూ లేదు తన గ్లామర్ ని తెలుగుదేశం గ్రామర్ తో ప్లస్ చేసి వైసీపీని ఓడించాలని చూస్తున్నారు. అంటే వెరీ సింపుల్ అన్న మాట. టీడీపీకి క్యాడర్ పటిష్టంగా ఉంది. లీడర్ గా బాబు వ్యూహాలూ ఉన్నాయి. కానీ గ్లామర్ తక్కువగా ఉంది. ఇక జనసేనకు ఫుల్ గా గ్లామర్ ఉంది కానీ పార్టీ గ్రౌండ్ లెవెల్ దాకా లేదు. అందుకే పొత్తు పాట అందుకుని పవన్ తెలివిగానే రాజకీయం చేస్తున్నారు.

పవన్ కి పాలిటిక్స్ తెలియదు అనుకున్న వారు అంతా పప్పులో కాలేసేలా చాలా వినూత్నంగా ఆయన జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇక జనసేనలో ఉన్న నాయకులకు కూడా టీడీపీతో చెలిమికి ఒప్పించాలి. వారిని తనతో రప్పించాలి. అంటే దానికి పవన్ కనిపెట్టిన వ్యూహం యాంటీ జగన్ స్లోగన్.

జగన్ మీద గత నాలుగున్నరేళ్ళుగా విపరీతంగా విరుచుకుపడుతూ జగన్ ఒక్కడు ఉంటే చాలు ఏపీ సర్వనాశనం అని పదే పదే చెబుతూ వస్తున్నారు పవన్. జగన్ ఒక ప్రత్యర్ధి పార్టీ అని తాము మరో పార్టీ అని ట్రెడిషనల్ పాలిటిక్స్ చేయడం లేదు. జగన్ ని తరిమేయాలి. ఏపీలో జగన్ ఉండకూడదు అంటూ పవన్ చెబుతున్నారు

జనసైనికులకు పవన్ అంటే రెండు చేతులూ అలా అప్రయత్నంగా కదిలి చప్పట్లు కురుస్తాయి. అదే జగన్ అన్న మరో మూడు అక్షరాల మీద పవన్ నోటి వెంట ఘాటు విమర్శలు చేసినా కూడా చప్పట్లు కురుస్తాయి. ఎందుకో తెలియదు కానీ జగన్ అంటే చాలు పవన్ తనతో పాటు సైనికులూ ఊగిపోయేలా ఆవేశం తెప్పించడంలో సక్సెస్ అయ్యారు. అలా జగన్ని విమర్శిస్తూనే తన రాజకీయాని పండించుకుంటున్నారు

ఇది కూడా కొత్త ట్రెండ్ సెట్టింగ్ పాలిటిక్స్ గానే చూడాలి. ఇక్కడ సిద్ధాంతాలు లేవు, విధానాల మీద వ్యతిరేకత చర్చలూ ఉండవు, కేవలం వ్యక్తులతోనే పోరాటం, వ్యక్తులనే ముందు పెట్టి సమరం చేయడం. అందుకే జగన్ నీవెంత నీ బతుకు ఎంత అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సమావేశంలో ఊగిపోతే జనసైనికుల నుంచి చప్పట్లు కురిసాయి. జగన్ని ఏపీ నుంచి తరిమికొడతామని అన్నపుడు కూడా అదే జోరు హుషారు కనిపించింది. ఈ తారకమంత్రంతో టీడీపీతో పొత్తులకు జన సైనికులు ఓకే అంటారా అన్నది కూడా ఒక చర్చ.

ఇపుడు అంతా బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి సీట్లు రాకపోయినా వచ్చిన సీట్లలో టీడీపీ తమ్ముళ్ల సహకారం దక్కకపోయినా అపుడు కూడా యాంటీ జగన్ స్లోగన్ నిలిస్తే పవన్ మాదిరిగానే నిబద్ధతతో ఏపీయే ముఖ్యం. రాజకీయం కాదు అని సైనికులు అంతా అనుకుంటే మాత్రం పవన్ పాలిటిక్స్ నూరు శాతం సక్సెస్ అయినట్లే.

చిత్రమేంటి అంటే జనసైనికులకు పవన్ మాత్రమే కావాలి. ఆయన ఏమి చెప్పినా కావాలి. ముందే చెప్పినట్లు వారు ట్రెడిషనల్ పాలిటిక్స్ అంటే తెలియని వారు కాబట్టి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో టీడీపీతో జనసేన పొత్తుకు పార్టీ ఆమోదముద్ర అయితే పడినట్లే అంటున్నారు. ఇక తీర్పు చెప్పాల్సింది బలమైన కాపు సామాజికవర్గం, ఏపీ జనం.