Begin typing your search above and press return to search.

ట్రంప్ వర్సెస్ ఆంథ్రోపిక్: ఏఐ ప్రపంచంలో రాజకీయ ప్రకంపనలు.. - అసలు ఏం జరిగింది?

అసలు ఈ వివాదం వెనుక ఉన్న అసలు నిజాలేంటి? క్లాడ్ ఏఐ భవిష్యత్తు ప్రమాదంలో పడిందా? లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

By:  A.N.Kumar   |   28 Feb 2026 12:59 PM IST
ట్రంప్ వర్సెస్ ఆంథ్రోపిక్: ఏఐ ప్రపంచంలో రాజకీయ ప్రకంపనలు.. - అసలు ఏం జరిగింది?
X

టెక్ ప్రపంచంలో పెను సంచలనం నమోదైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఏఐ దిగ్గజం 'ఆంథ్రోపిక్' మధ్య యుద్ధం మొదలైందా? రక్షణ శాఖ డిమాండ్లకు 'నో' చెప్పినందుకు ఆంథ్రోపిక్‌పై నిషేధం విధిస్తూ ప్రత్యర్థి సంస్థ ఓపెన్ ఏఐతో పెంటగాన్ చేతులు కలిపిందన్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయ్యాయి. అసలు ఈ వివాదం వెనుక ఉన్న అసలు నిజాలేంటి? క్లాడ్ ఏఐ భవిష్యత్తు ప్రమాదంలో పడిందా? లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేవలం సాంకేతిక అంశంగానే కాకుండా రాజకీయ, వ్యూహాత్మక ఆయుధంగా మారుతోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ మధ్య మొదలైన వివాదం ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యింది.

వివాదానికి దారితీసిన కారణమేంటి?

అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్), ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన 'క్లాడ్' మోడల్స్‌ను సైనిక అవసరాల కోసం ఎటువంటి పరిమితులు లేకుండా వాడాలని డిమాండ్ చేసింది. దీనికి ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ ససేమిరా అనడమే ఈ గొడవకు పునాది. ఏఐని యుద్ధ తంత్రాల్లో, నిఘా వ్యవహారాల్లో అపరిమితంగా వాడటం ప్రజాస్వామ్య విలువలకి, నైతిక నియమాలకు విరుద్ధం అని డారియో విభేదిస్తున్నారు. దీంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ శాఖ డిమాండ్లకు నో చెప్పడం దేశ భద్రత విషయంలో రాజీ పడటమేనని భావించిన ట్రంప్ ఆ సంస్థతో వ్యాపార సంబంధాలు తెంచుకోవాలని నిర్ణయించుకున్నారు.

రంగంలోకి ఓపెన్ ఏఐ.. పెంటగాన్‌తో భారీ ఒప్పందం

ఆంథ్రోపిక్ వెనక్కి తగ్గిన చోట..శామ్ ఆల్టమన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ పాగా వేసింది. పెంటగాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్వయంగా ఆల్టమనే ప్రకటించారు. "ప్రభుత్వంతో కలిసి ఏఐని బాధ్యతాయుతంగా వినియోగించడంపై చర్చలు జరిపాం. నిర్ణీత పరిమితుల్లోనే ఏఐ పనిచేసేలా సాంకేతిక రక్షణలు కల్పిస్తాం." - శామ్ ఆల్టమన్ ప్రకటించారు. దీంతో ఓపెన్ ఏఐ ఇప్పుడు అమెరికా ప్రభుత్వానికి అత్యంత సన్నిహితమైన ఏఐ భాగస్వామిగా అవతరించింది. ఈ పరిణామం తర్వాత ప్రస్తుతం సోషల్ మీడియాలో "ఆంథ్రోపిక్ నిషేధం - కంపెనీ దివాళా" అనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఎంతో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అమెరికా ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విడుదల కాలేదు. వైరల్ అవుతున్న వార్తలకు ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.

"వోక్ ఏఐ"పై విమర్శలు

ఎలాన్ మస్క్, రిపబ్లికన్ మద్దతుదారులు ఆంథ్రోపిక్‌ను "వోక్ ఏఐ" అని విమర్శిస్తున్నారు. అంటే ఈ మోడల్స్ అతిగా రాజకీయ నిబద్ధతను పాటిస్తూ వాస్తవాలను దాస్తున్నాయని వారి ఆరోపణ.

కంపెనీ దివాళా తీస్తుందా?

ప్రభుత్వ కాంట్రాక్టులు పోవడం అనేది పెద్ద దెబ్బే అయినప్పటికీ ఆంథ్రోపిక్ దివాళా తీసే అవకాశం తక్కువ. ఈ సంస్థలో అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజాలు బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టాయి. వేలాది ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికీ క్లాడ్ ఏఐని వాడుతున్నాయి.

ఏఐ భవిష్యత్తు ఎటువైపు?

ఈ వివాదం కేవలం రెండు కంపెనీల మధ్య పోరు కాదు. ఇది ఏఐ నియంత్రణ , జాతీయ భద్రత మధ్య జరుగుతున్న యుద్ధం. టెక్నాలజీ అనేది ప్రభుత్వాల చేతిలో ఒక శక్తివంతమైన సాధనంగా మారుతున్న తరుణంలో నైతిక విలువలకు కట్టుబడి ఉండే కంపెనీలు మనుగడ సాగిస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.