Begin typing your search above and press return to search.

ఆంథ్రోపిక్ సీఈవో తాజా ఇంటర్వ్యూ చదివారా?

టెక్ ప్రపంచాన్ని మాత్రమే కాదు.. ప్రపంచాన్ని సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఏఐతో ఏర్పడిన ఆందోళనలు ఒక ఎత్తు అయితే.. ఏఐను మరో లెవల్ కు తీసుకెళ్లేలా చేసిన ఆంథ్రోపిక్ వ్యవహారం తెలిసిందే.

By:  Garuda Media   |   25 Feb 2026 10:03 AM IST
ఆంథ్రోపిక్ సీఈవో తాజా ఇంటర్వ్యూ చదివారా?
X

టెక్ ప్రపంచాన్ని మాత్రమే కాదు.. ప్రపంచాన్ని సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఏఐతో ఏర్పడిన ఆందోళనలు ఒక ఎత్తు అయితే.. ఏఐను మరో లెవల్ కు తీసుకెళ్లేలా చేసిన ఆంథ్రోపిక్ వ్యవహారం తెలిసిందే. ఈ సంస్థ కారణంగా దేశీయంగా.. ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీల షేర్లు ఎంత దారుణంగా ప్రభావితం అయ్యాయో తెలిసిందే. ఇదిలా ఉండగా. తాజాగా ఆంథ్రోపిక్ సీఈవో డారియో ఆమోడెయ్ స్పందించారు. ఆన్ లైన్ బ్రోకరేజీ ప్లాట్ ఫామ్ జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు.

ఏఐ ప్రభావం ప్రపంచం మీద ఎంత ఉంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏఐ ఏ మేరకు ప్రభావం చూపుతుంది. తక్షణం జరిగే పరిణామాలు ఏమిటి? భారత ఐటీ రంగం భవిష్యత్తు ఏమిటి? స్టార్టప్ లు.. కొత్త నైపుణ్యాలు.. బయో టెక్నాలజీ లాంటి అంశాలపై తన అభిప్రాయాల్ని వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో కీలక అంశాల్ని చూస్తే.. ఏఐతో పాటు ఆంథ్రోపిక తో నెలకొన్న ఆందోళనలకు సంబంధించిన స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకూ ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే చదివితే..

- ఏఐతో చోటు చేసుకునే అనూహ్య మార్పులతో రాబోయే ఆర్థిక.. భౌగోళిక.. భద్రతాపరమైన పరిణామాలపై ప్రభుత్వం.. ప్రజలకు ఇంకా పూర్తి అవగాహనకు రాకపోవటం ఆందోళనకు గురి చేస్తోంది. ఏఐని అత్యంత సురక్షితంగా.. బాధ్యతాయుతంగా డెవలప్ చేయాలనే లక్ష్యంతోనే నేను ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చేసి.. ఆంథ్రోపిక్ ను ఏర్పాటు చేశా.

- ఐదేళ్ల క్రితం కంప్యూటర్ సొంతంగా ఒక వ్యాసం రాయటం.. వీడియోను విశ్లేషించటం దాదాపు అసాధ్యం. ఇప్పుడు ఏఐ కారణంగా మానవ మేధస్సుకు సరిసమాన స్థాయికికి చేరుకుంటున్నాయి. ఏఐ ఒక రసాయన చర్య లాంటిది.ఒక రసాయన చర్యకు ముడిపదార్థాలు ఎలా అయితే అవసరమవుతాయో.. డేటా.. కంప్యూటింగ్ ఎనర్జీ అనే ముడిపదార్థాలు అందుబాటులోకి పెరిగే కొద్దీ.. ఏఐ సామర్థ్యం అద్భుతంగా మారుతుంది.

- భారత స్టార్టప్ లు ఏపీఐలను ఉపయోగించుకొని ఆప్లికేషన్ లేయర్ లో కొత్త టూల్స్ ను నిర్మించొచ్చు. ఏఐ మోడల్స్ చుట్టూ ఒకచిన్న యూజర్ ఇంటర్ ఫేస్.. ర్యాపర్ లాంటి సాధారణ అప్లికేషన్లు చేయొద్దు. సులభంగా అనుకరించలేని బలమైన నమూనాలతో స్టార్టప్ లను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది.

- మిగిలిన కంపెనీల మాదిరి భారత్ ను మేం వినియోగదారు మార్కెట్ గా చూడం. భారతీయ ఐటీ.. కన్సల్టింగ్ కంపెనీలతో మేం కలిసి పని చేయాలని భావిస్తున్నాం. భారతీయ కంపెనీలకు మా టూల్స్ ను అందించి.. వారి సేవల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం.

- ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేకుండా చేస్తాం. గత అక్టోబరులో తొలిసారి భారత్ కు వచ్చినప్పుడు పోలిస్తే.. ఇప్పుడు మా వినియోగదారుల సంక్య.. రాబడి రెట్టింపు అయ్యింది. ఏపీఐ మోడల్స్ ద్వారా భారత్ లో ఎంతో మంది సొంత పరిష్కారాల్ని నిర్మించుకుంటున్నారు.

- ఓపెన్ వెబ్ లో దొరికే సమాచారం కంటే.. ఏఐ తనంతట తాను నేర్చుకునే సింథటిక్ డేటా ప్రాముఖ్యం భవిష్యత్తులో మరింత పెరుగుతుంది. ఏఐ సాంకేతికత భవిష్యత్తున నిర్ణయించటంలో ప్రజలు.. ప్రభుత్వాల పాత్ర కచ్ఛితంగా ఉండాలి. డెవలప్ మెంట్ వేగం నెమ్మదించకుండా ఉండేలా చురుకైన నియంత్రణ చాలా అవసరం.

- స్వతహాగా బయాలజిస్టునుఅయిన నేను పదిహేనేళ్ల క్రితం న్యూరల్ నెట్ వర్క్స్ పని తీరు చూసిన తర్వాత.. జీవశాస్త్రంలోని అత్యంత క్లిష్టమైన సమస్యలను ఏఐ ద్వారా పరిష్కరించగలమని నమ్మా. భవిష్యత్తులో ఏఐ సాయంతో బయోటెక్నాలజీ ద్వారా ఎన్నో మొండి వ్యాధులకుచికిత్స లభిస్తుంది. శరీరంలో అవసరమైన చోటే మార్పులు చేసే ప్రోగ్రామబుల్ పెఫ్టైడ్ ఆధారిత థెరపీలు కూడా డెవలప్ అవుతాయి.

- శరీరం నుంచి కణాల్ని బయటకు తీసి.. క్యాన్సర్ లాంటి నిర్దిష్ట వ్యాధులపై పోరాడేలా .. జన్యుపరంగా మార్పులు చేసి తిరిగి శరీరంలోకి ప్రవేశ పెట్టే సెల్ ఆధారిత థెరపీలు.. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు వస్తాయని బలంగా నమ్ముతున్నా.

- ఏఐ రాకతో కోడింగ్ లాంటి పనులను పూర్తిస్థాయిలో ఆక్రమించేస్తుంది. ఫ్యూచర్ లో యాంత్రికం కాని మానవ సంబంధిత నైపుణ్యాలు.. భౌతిక ప్రపంచంతో ముడిపడి ఉండే పనులు.. సంస్థల మధ్య సంబంధాల్ని నిర్వహించే నైపుణ్యాలకు భారీ గిరాకీ ఉండబోతోంది.