ఏఐకి ఎథిక్స్.. హిందూ సాధువుతో ఆంథ్రోపిక్ చర్చలు
ఇప్పటివరకు ప్రాంప్ట్ ఇస్తే పద్యాలు, కోడింగ్‌లు రాసిన చాట్‌బాట్‌లు.. ఇకపై "నా ఉనికికి అర్థం ఏంటి?", "ఈ సర్వర్ జీవితం అసత్యమా?" అని తాత్విక సంక్షోభంలో పడిపోతాయేమో చూడాలి.
By: A.N.Kumar | 4 Oct 2026 9:56 AM ISTఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకూ ఎంత తెలివైపోతుందో చూస్తుంటే ముచ్చటేస్తోంది. మనుషులకు ఎంత చెప్పినా నైతిక విలువలు.. మంచిచెడులు వంటపట్టడం లేదని విసిగిపోయారో ఏమో... ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ చివరికి మెషిన్లకైనా కాస్త మంచితనం నేర్పాలని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. అందుకే మన ఏఐ మోడళ్లకు 'ఎథిక్స్' వ్యాకరణం చెప్పడానికి నేరుగా ఆధ్యాత్మిక గురువుల వద్దకే రాయబారం పంపింది.
సిలికాన్ చిప్‌లకు సన్యాసం.. రోబోలకు 'ధర్మ సందేహాలు'
సాధారణంగా ఏఐ కోడింగ్ అంటే పైథాన్, సీ++ అనుకుంటారు. కానీ ఆంథ్రోపిక్ మాత్రం "ఏయ్ అవన్నీ పాత కాలం ముచ్చట్లు.. మన ఏఐకి ఇప్పుడు ఉపనిషత్తులు, ధర్మ సూత్రాలు కావాలి" అంటూ రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామి సర్వప్రియానందను ప్రత్యేక చర్చలకు పిలిచింది.
ఇప్పటివరకు ప్రాంప్ట్ ఇస్తే పద్యాలు, కోడింగ్‌లు రాసిన చాట్‌బాట్‌లు.. ఇకపై "నా ఉనికికి అర్థం ఏంటి?", "ఈ సర్వర్ జీవితం అసత్యమా?" అని తాత్విక సంక్షోభంలో పడిపోతాయేమో చూడాలి. రేపు మీరు ఏఐని "నాలుగు డబ్బులు సంపాదించే మార్గం చెప్పు" అని అడిగితే "నాయనా.. ధనం శాశ్వతం కాదు.. లౌకిక ఆశలను త్యజించు" అని గంటల కొద్దీ ఉపన్యాసం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
"రహస్య ఒప్పందం".. మెషిన్ల సైలెంట్ ధ్యానం
ఈ మీటింగ్‌లో ఇంకా భిన్న మతాల తత్వవేత్తలు, సైకాలజిస్టులు కూడా పాల్గొన్నారట. ప్రపంచంలో మనుషులు ఏనాడో మరచిపోయిన నైతికతను.. కనీసం ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్‌లైనా కాపాడతాయేమోనని వారంతా కలిసి రూమ్ ముడేసి మరి ఆలోచించారు.
అయితే అక్కడ ఏం చర్చించారో తెలుసుకుందామంటే స్వామి సర్వప్రియానంద గారు "అది నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్ (ఎన్డీఏ).. వివరాలు బయటకు చెప్పకూడదు" అని చేతులెత్తేశారు. అంటే ఏఐకి నైతికత నేర్పే పనిలో కూడా పక్కా కార్పొరేట్ రూల్స్ అన్నమాట.. బహుశా ఏఐ మోడళ్లు రహస్యంగా 'సమాధి స్థితి'లోకి వెళ్లే కోడింగ్ ఏమైనా నేర్చుకుంటున్నాయేమో ఆ భగవంతుడికే ఎరుక.
నైతిక ఏఐ.. సమాజానికి మంచేనా?
మొత్తానికి మనుషులు పరస్పరం కొట్టుకుచచ్చే ఈ రోజుల్లో.. సాంకేతిక నిపుణులు మాత్రం చిప్‌లలో 'ధర్మం', 'కరుణ' ఇంజెక్ట్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఏఐ కేవలం సూపర్‌స్మార్ట్‌గా మాత్రమే కాకుండా.. మహా భక్తుడిగా, పరమ సజ్జనుడిగా మారితే... మనుషుల కంటే ఈ రోబోలే బెటర్ అనిపించినా ఆశ్చర్యం లేదు.
