Begin typing your search above and press return to search.

ఆ అధికారిణితో ఆస్ట్రేలియా ప్రధాని రెండో పెళ్లి

మరోసారి తాను వైవాహిక జీవితంలోకి ప్రవేశిస్తున్న విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్వయంగా వెల్లడించారు

By:  Tupaki Desk   |   15 Feb 2024 6:08 AM GMT
ఆ అధికారిణితో ఆస్ట్రేలియా ప్రధాని రెండో పెళ్లి
X

మరోసారి తాను వైవాహిక జీవితంలోకి ప్రవేశిస్తున్న విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్వయంగా వెల్లడించారు. ఆస్ట్రేలియా దేశ చరిత్రలో ప్రధానమంత్రి పదవిలో ఉంటూ పెళ్లి చేసుకొంటున్న తొలి ప్రధానిగా ఆంథోని అల్బనీస్ మారారు. కొంత కాలంగా సహజీవనం చేస్తున్న న్యూ సౌత్ వేల్స్ పబ్లిక్ సర్వీస్ అసోసియేషన్ లో ఆఫీసర్ గా పని చేస్తున్న జోడీ హైడస్ తో ఎంగేజ్ మెంట్ జరిగిన విషయాన్ని ప్రకటించారు.

''ఆమె అంగీకరించారు'' అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఆయన.. తామిద్దరం కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను షేర్ చేశారు. 60 ఏళ్ల అల్బనీస్ గడిచిన నాలుగేళ్లుగా హైడన్ తో సహజీవనం చేస్తున్నారు. ప్రధాని అల్బనీస్ కు ఇది రెండో పెళ్లి. 2000లో ఆయన న్యూసౌత్ వేల్స్ డిప్యూటీ ప్రీమియర్ కార్మెల్ టెబట్ ను పెళ్లాడారు. వీరికి 23 ఏళ్ల కొడుకు ఉన్నాడు. పందొమ్మిదేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ వారిద్దరి 2019లో విడాకులు తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. 2020లో జరిగిన ఒక బిజినెస్ డిన్నర్ లో హైడన్ ను తొలిసారి కలిశారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య పరిచయం పెరిగి సన్నిహితులయ్యారు. నాలుగేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. 2022లో జరిగిన ఫెడరల్ ఎన్నికల సమయంలోనూ ఆయన హైడన్ తో కలిసి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ప్రధానిగా ఎన్నికైన తర్వాత పలు అధికారిక కార్యక్రమాలకు ఆమెను తన వెంట తీసుకెళ్లేవారు. తాజాగా తామిద్దరం పెళ్లి చేసుకోనున్న విషయాన్ని ఆయన అధికారికంగా వెల్లడించారు. ఆయన నిర్ణయంపై అధికార.. ప్రతిపక్ష నేతలు తమ అభినందనలు తెలియజేస్తున్నారు.