Begin typing your search above and press return to search.

బీఆర్‌ఎస్‌ కు మరో షాక్‌!

కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లను, కార్పొరేటర్లను బెదిరించి బీఆర్‌ఎస్‌ లో చేర్చుకుంది.

By:  Tupaki Desk   |   14 Jan 2024 1:30 PM GMT
బీఆర్‌ఎస్‌ కు మరో షాక్‌!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి కాంగ్రెస్‌ పార్టీ మరో షాక్‌ ఇస్తోంది. గతంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సాధించిన మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను బీఆర్‌ఎస్‌ హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లను, కార్పొరేటర్లను బెదిరించి బీఆర్‌ఎస్‌ లో చేర్చుకుంది.

ఇప్పుడు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు బీఆర్‌ఎస్‌ చేతిలో ఉన్న మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కాంగ్రెస్‌ పార్టీ చేజిక్కించుకుంటోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టడంతో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మెజారిటీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ఎగబడుతున్నారు. దీంతో ఇన్నాళ్లూ బీఆర్‌ఎస్‌ చేతిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు హస్తగతమవుతున్నాయి.

ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో దెబ్బతింది. ఒక్క స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోగా గ్రేటర్‌ హైదరాబాద్‌ లో బలపడటమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు కదులుతోంది.

ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ ఆకర్‌‡్షలో భాగంగా బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల మున్సిపాలిటీలపై హస్తం నేతలు కన్నేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ప్రజా ప్రతినిధులు చాలా మంది తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వారంతా కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే భువనగిరి, నల్గొండ పురపాలక సంస్థలు కాంగ్రెస్‌ హస్తగతమయ్యాయి.

చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌ లో మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉంటే.. 16 మంది బీఆర్‌ఎస్‌ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మేయర్‌ మహేందర్‌ గౌడ్‌ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మేయర్‌ మహేందర్‌ గౌడ్‌ ను దించేసి.. తిరుగుబాటు వర్గానికి చెందిన లతా ప్రేమ్‌ గౌడ్‌ ను మేయర్‌ పీఠంపై కూర్చోబెట్టడానికి నిర్ణయించారు. తిరుగుబాటు లేవనెత్తిన 16 మంది కార్పొరేటర్లు అందరూ కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

ఇక ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌ కప్పరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. మొత్తం 24 సభ్యులకు 15 మంది బీఆర్‌ఎస్, ఇద్దరు బీజేపీ సభ్యులు మొత్తం 17మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.

అలాగే రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి నిర్ణయించారు. ఇప్పటికే జాయింట్‌ కలెక్టర్‌ కు అవిశ్వాస తీర్మాన ప్రతిని అందజేశారు. వీరంతా కాంగ్రెస్‌ గూటికి చేరుకోవడానికి నిర్ణయించారు. ఇవేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 40 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. దీంతో ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాంగ్రెస్‌ ఖాతాలో చేరనున్నాయి.