Begin typing your search above and press return to search.

వైసీపీకి మరో ఎంపీ రాజీనామా... జగన్ కి ధన్యవాదాలు!

అవును... సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు మారుతున్నే నేతల సంఖ్య యథావిధిగా పెరుగుతూనే ఉంది.

By:  Tupaki Desk   |   28 Feb 2024 5:10 AM GMT
వైసీపీకి మరో ఎంపీ రాజీనామా... జగన్  కి ధన్యవాదాలు!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా టిక్కెట్ దక్కలేదనో.. కోరుకున్న చోట దక్కలేదనో.. కారణం ఏదైనా కానీ పార్టీలు మారుతున్నవారితో సరికొత్త సందడి మొదలైంది. ఇప్పటికే ఈ విషయంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీలు మారగా... వారిసరసన వైసీపీకి చెందిన మరో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి చేరారు.

అవును... సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు మారుతున్నే నేతల సంఖ్య యథావిధిగా పెరుగుతూనే ఉంది. పైగా అభ్యర్థుల ప్రకటన విషయంలో అన్ని పార్టీలూ క్లైమాక్స్ కి వచ్చేసే సరికి వీరి దూకుడు మరింత ఎక్కువవుతుంది. ఈ క్రమంలో వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆ పార్టీని వీడారు. ఈ మేరకు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా మైకుల ముందుకు వచ్చిన ఆయన... ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉందని.. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని తెలిపారు. ఇక తమ కుటుంబానికి అహం లేదు కానీ ఆత్మగౌరవం ఉందని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో కొన్ని అనివార్య కారణాలవల్ల వైసీపీని వీడుతున్నట్లు మాగుంట ప్రకటించారు. అయితే... ఇది తనకు బాధాకరమైన విషయమే అయినప్పటికీ తప్పడం లేదని తెలిపారు.

ఇదే సమయంలో తన కుటుంబ సభ్యులంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా బరిలోకి తన కుమారుడూ మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించినట్లు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో మరోసారి మాగుంట కుటుంబాన్ని మరోసారి ఆదరించమని ప్రకాశం జిల్లా వాసులందరినీ కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో సహాయ సహకారాలు అందించారని చెబుతూ... ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు అని మాగుంట ప్రకటించారు. ఇదే క్రమంలో వైసీపీ నేతలకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.