Begin typing your search above and press return to search.

తలతిక్కల నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా అన్నవరం దేవస్థానం?

దేవస్థానం జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ఉంటే మాత్రమే పెళ్లిళ్లు చేయించటానికి అనుమతులు ఉంటాయని వారు పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   2 Sep 2023 4:39 AM GMT
తలతిక్కల నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా  అన్నవరం దేవస్థానం?
X

ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరున్నఅన్నవరంలో.. దేవస్థానం అధికారులు తీసుకునే నిర్ణయాలు.. అక్కడి వ్యవహారాలు చూస్తే.. సత్యదేవుడి కొలువులో ఇంత దారుణ పరిస్థితులా? అన్న భావన కలుగక మానదు. అన్నవరం కొండ మీదకు చేరుకున్న క్షణం నుంచి.. అక్కడ ఎదురయ్యే అనుభవాల్ని చూసినప్పుడు దేవస్థానం అధికారులపై కోపం కట్టలు తెంచుకునేలా ఉంటుంది. ప్రతి అడుగులోనూ కొండ మీదకు వచ్చే భక్తుల నుంచి డబ్బులు గుంజేయాలన్నట్లుగా అక్కడి వారి తీరు ఉంటుంది. తాజాగా అన్నవరం అధికారులు తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

అన్నవరం కొండ మీద పెళ్లిళ్లు చేయించటానికి వచ్చే బ్రాహ్మణులు.. సన్నాయి వాయిద్య కళాకారులకు ధ్రువీకరణ పత్రాలు ఉంటే మాత్రమే అనుమతిస్తామంటూ జారీ చేసిన ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేవస్థానం జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ఉంటే మాత్రమే పెళ్లిళ్లు చేయించటానికి అనుమతులు ఉంటాయని వారు పేర్కొన్నారు.

పెళ్లిళ్లు బ్రాహ్మణులు.. డోలు సన్నాయి వాయిద్యకారులు.. తమ ఆధార్ కార్డు.. కుల.. విద్యార్హత.. పాండిత్యానికి సంబంధించి గెజిటెడ్ అధికారి జారీ చేసిన పత్రం ఉండాలని పేర్కొన్నారు. అంతేకాదు.. వారి క్యారెక్టర్ ను తెలిపేందుకు వీలుగా పురోహిత సంఘం జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు.. వాయిద్యకారులైతే అదనంగా వారి సొంత వాయిద్య పరికరాలకు సంబంధించిన ఫోటోలు.. వాటిని నిర్దారించే ధ్రువీకరణ పత్రాలు ఉండాలని పేర్కొన్నారు.

ఇదంతా అన్నవరం కొండ మీద పెళ్లిళ్లు జరిపేందుకు వచ్చే బ్రాహ్మణులకు.. వాయిద్య కళాకారులకు నిర్దేశించిన మార్గదర్శకాలు. వీటికి తోడు రూ.2వేల రుసుం దేవస్థానానికి కట్టి గుర్తింపు కార్డు పొందాలని పేర్కొన్నారు. అప్పుడు మాత్రమే అన్నవరం కొండ మీద పెళ్లిళ్లు జరపటానికి అనుమతి ఉంటుందన్న ప్రకటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది.

దేవస్థానం అధికారుల తలతిక్క నిర్ణయాలకు ఈ ఉదంతం పెద్ద ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు. ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో.. అధికారులు వెనక్కి తగ్గి.. తమ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు పర్యవసానాల గురించి ఆలోచించాలే తప్పించి.. నిర్ణయం తీసుకున్న తర్వాత కాదన్న మాట బలంగా వినిపిస్తోంది.