Begin typing your search above and press return to search.

అన్నామలై : తమిళ ఏడారిలో కమలాన్ని విరబూయిస్తారా...!?

ఆయన రాజకీయ నేత కాదు, ఆయన కుటుంబం రాజకీయ కుటుంబం కాదు రాజకీయ నేపధ్యం ఏ మాత్రం లేదు

By:  Tupaki Desk   |   22 March 2024 3:51 AM GMT
అన్నామలై : తమిళ ఏడారిలో కమలాన్ని విరబూయిస్తారా...!?
X

ఆయన రాజకీయ నేత కాదు, ఆయన కుటుంబం రాజకీయ కుటుంబం కాదు రాజకీయ నేపధ్యం ఏ మాత్రం లేదు. ఆయన ఒక పోలీస్ అధికారి. సమాజానికి సేవ చేయాలనుకుని తన ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఎంచుకున్న పార్టీ బీజేపీ కావడమే చిత్రం.

కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న కె అన్నామలై గత ఎన్నికల వరకూ పోలీస్ ఆఫీసర్ గానే ఉన్నారు. ఆయన 2019లో సర్వీస్‌కి రాజీనామా చేసి 2020లో బీజేపీలో చేరారు. ఒక సంవత్సరం తర్వాత కేవలం 37 ఏళ్ల వయస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

అలా పార్టీ రాష్ట్ర శాఖలో అధ్యక్షుడిగా అతి పిన్న వయస్కుడైన వ్యక్తిగా అన్నామలై రికార్డు సృష్టించారు. ఈ మాజీ ఐపీఎస్ అధికారి కె అన్నామలై బీజేపీకి ప్రత్యేకం. అంతకంటే కూడా తమిళనాడులో ఆయన బీజేపీకి ఆశా కిరణం.

బీజేపీకి తమిళనాట ఆయన రాక వరకూ ఏమీ లేదు. అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని ఏదో అలా ఉనికి చాటుకుంటూ వచ్చింది. ఇపుడు మాత్రం కనీసంగా అయిదు గరిష్టంగా పది ఎంపీ సీట్లను గెలుస్తామని బీజేపీ తమిళనాడులో ధీమా గా ఉంది అంటే దానికి ఒకే ఒక వ్యక్తి కారణం.

ఆయనే అన్నామలై. ఆయనకు ముందు ఎంతో మంది బీజేపీ అధ్యక్షులుగా ఉన్నా కేవలం అలంకారప్రాయంగా ఉంటూ వచ్చారు. ద్రవిడ వాదం బలంగా ఉన్న చోట హిందూత్వను తట్టిలేపడం అన్నామలైకే చెల్లింది అని చెప్పాలి. ఆయన పాదయాత్రలకు జనాలు తండోపతండాలుగా వచ్చారు అంటేనే ఆయన శ్రమ పరిశ్రమ తెలిసిపోతోంది.

ఆయన నా నేల నా ప్రజలు అన్న నినాదంతో ఈ పాదయాత్రను వేలాది కిలోమీటర్లు చేస్తూ వచ్చారు. తమిళనాడు యువత ఆయనకు కొండంత మద్దతుగా నిలిచింది. అదే సమయంలో సాధారణ ప్రజలు కూడా అన్నామలై వెంట నిలిచారు. నాస్తిక వాదానికి ద్రవిడ సిద్ధాంతానికే ప్రజలు ఓట్లు వేస్తారని దానినే నమ్ముతారని అంతా అనుకున్న సీన్ నుంచి అన్నామలై మార్చేసారు.

తమిళనాట హిందూత్వ మీద యువతకు ఉన్న మక్కువ ఏంటో అన్నామలై పాదయాత్రకు వచ్చిన జనాలను బట్టే తెలుస్తుంది. ఆయన డీఎంకేకు సవాల్ చేస్తూ హిందూత్వ అంటే ఏంటో చాటి చెబుతూ పాలక పక్షానికి దడ పుట్టిస్తున్నారు. బీజేపీ సైతం అన్నామలైకి పూర్తిగా స్వేచ్చ ఇచ్చింది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులో పర్యటిస్తూ అన్నామలైని మెచ్చుకున్నారు.నిండుగా దీవెనలు వేదిక మీదనే ఇచ్చి ముందుకు సాగిపోమన్నారు. ఇక తమిళనాడులో తొలి జాబితాతో కోయంబత్తూరు నుంచి అన్నామలైను బీజేపీ పోటీకి దింపింది

అలాగే కోయంబత్తూరు బీజేపీతో ప్రత్యేకమైన బంధం కలిగిన సీటు. బీజేపీ ఎంపీని లోక్‌సభకు పంపిన తొలి తమిళనాడు నియోజకవర్గాల్లో ఇది ఒకటి. అంతే కాదు 1998లో ఎల్‌కే అద్వానీ పర్యటన సందర్భంగా కోయంబత్తూరులో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 58 మంది మరణించారు. అలా ఈ సీటు గుర్తుండిపోతుంది. ఇక కోయంబత్తూరులో ఉత్తరాది నుండి వలస వచ్చిన వారి జనాభా ఎక్కువ. వారంతా బీజేపీకి హిందూత్వకు కట్టుబడి ఉన్నవారు కావడం విశేషం.

ఇంతటి కీలకమైన స్థానం కాబట్టే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుండి అన్నామలై పోటీ చేయనున్నారు ఇది బిజెపికి ప్రత్యేకమైన స్థానం అని వేరేగా చెప్పాల్సింది లేదు. గెలిచి ఎంపీ అయితే అన్నామలై కేంద్ర మంత్రి కావడం తధ్యం అంటున్నారు. ఆ అధికార బలంతో 2026 ఎన్నికల్లో బీజేపీ తమిళనాడు లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి అధికారం కోసం గట్టి ఫైట్ ఇస్తుందని .అంటున్నారు.