Begin typing your search above and press return to search.

కేజ్రీకి మరీమరీ చెప్పా.. వినలేదు.. ‘‘అన్నా’’.. అంత మాటన్నాడే?

2011లో సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో కలిసి ఆయన చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనమైంది.

By:  Tupaki Desk   |   22 March 2024 11:54 AM GMT
కేజ్రీకి మరీమరీ చెప్పా.. వినలేదు.. ‘‘అన్నా’’.. అంత మాటన్నాడే?
X

దేశంలో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు. దాదాపు పదేళ్లుగా ఢిల్లీ సీఎంగా ఉంటూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారిన కేజ్రీని ఎట్టకేలకు కటకటాల వెనక్కు పంపింది. అయితే, ఇంతకూ ఎవరీ కేజ్రీవాల్...? ఆయన రాజకీయ అరంగేట్రం ఎలా జరిగింది? ఢిల్లీ లాంటి చోట రెండు సార్లు బంపర్ మెజారీటీతో ఎలా సీఎం అయ్యారు..? పంజాబ్ వంటి రాష్ట్రాన్ని ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా వశం చేసుకుంది..?

ఆయన సహచరుడు..

కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చింది అవినీతి వ్యతిరేక ఉద్యమంతో. 2011లో సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో కలిసి ఆయన చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనమైంది. మీడియా కూడా పెద్దఎత్తున మద్దతు పలికింది. కేజ్రీ, అన్నా ఇద్దరూ ఢిల్లీ నిరసన దీక్షకు దిగడం చలింపజేసింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఎవరి దారి వారిదిఅయింది. ఇప్పుడు కేజ్రీ ఢిల్లీ మద్యం కేసలో అరెస్టు అయిన నేపథ్యంలో అన్నా స్పందించారు.

అప్పుడు పుట్టిన పార్టీనే..

2011లో హజారే నేతృత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగింది. దీన్నుంచే ఆమ్‌ఆద్మీ పార్టీ ఆవిర్భవించింది. అయితే, హజారే తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ఆప్ నుంచి వైదొలిగారు. కానీ, పలు అంశాల్లో పార్టీపై విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ వీటిని పట్టించుకోలేదు.

మద్యానికి దూరంగా ఉండామన్నా..

మద్యం అనే అంశానికి దూరంగా ఉండాలని పలుసార్లు కేజ్రీని హెచ్చరించానని అన్నా అంటున్నారు. అయితే, మరింత సంపాదన ఉద్దేశంతో కేజ్రీవాల్ ప్రత్యేక విధానాన్నే తెచ్చారని తెలిపారు. నాతో కలిసి మద్యానికి వ్యతిరేకంగా గళం వినిపించిన వ్యక్తి.. మద్యం విధానాన్ని తీసుకొచ్చి చిక్కుల్లో పడ్డారు. ఆయన అరెస్టు బాధాకరమే. కానీ, ఏం చేయగలం.? చట్టం ప్రకారం ఏం జరిగినా ఎదురుచెప్పలేం’’ అని అన్నారు. ఢిల్లీ మద్యం విధానంపై హజారే గతంలోనూ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. 2022లోనే కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. మద్యం లాగానే అధికారం కూడా మత్తునిస్తుంది. మీరు అధికారం మత్తులో ఉన్నారు అని ధ్వజమెత్తారు.