జగన్ తీరుపై హోంమంత్రి అనితకు అనుమానం
మాజీ సీఎం జగన్మోహనరెడ్డి తీరుపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం సత్యసాయి జిల్లా రాప్తాడులో పర్యటించిన మాజీ సీఎం జగన్ పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 9 April 2025 4:53 PM ISTమాజీ సీఎం జగన్మోహనరెడ్డి తీరుపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం సత్యసాయి జిల్లా రాప్తాడులో పర్యటించిన మాజీ సీఎం జగన్ పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. జగన్ భద్రతకు భారీ సంఖ్యలో పోలీసులను మోహరించామని, కానీ, ఆయన భద్రతా లోపాలంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. జగన్ ప్రయాణించిన హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింటే, ఆయన రోడ్డు మార్గాన వెళ్లిపోయిన 15 నిమిషాలకే హెలికాఫ్టర్ లో పైలెట్లు ఎలా వెళ్లగలిగారని అనిత సందేహం వ్యక్తం చేశారు.
మాజీ సీఎం హోదాలో జగన్మోహనరెడ్డికి ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువే ఇస్తున్నామని హోంమంత్రి అనిత వివరణ ఇచ్చారు. తనకు భద్రత కల్పించడం లేదని మాజీ సీఎం జగన్ తోపాటు, ఆ పార్టీ నేతలు ఆరోపించడంపై హోంమంత్రి విరుచుకుపడ్డారు. ప్రజలు 11 సీట్లతో తీర్పిచ్చినా సిగ్గు రాలేదా? అంటూ ఫైర్ అయ్యారు. గతంలో ఐపీసీ కన్నా వైసీపీ కోడ్ అమలు చేశారని విమర్శించారు. రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించిన జగన్మోహనరెడ్డికి 1100 మంది పోలీసులతో రక్షణ ఇచ్చామన్నారు. హెలిపాడ్ వద్దే 250 మంది పోలీసులు బందోబస్తు కాశారని వివరించారు. వీఐపీని తీసుకెళ్లడానికి వీలుకాని హెలికాప్టర్ 15 నిమిషాల్లో ఎలా ఎగిరి వెళ్లిందని ప్రశ్నించారు. ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని అనిపిస్తోందని, వీటిన్నింటిపైన విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.
చీటికీ మాటికీ లా అండ్ ఆర్డర్ లేదు అంటున్నారని, గతంలో చంద్రబాబు బయటకి రాకుండా అడ్డుకున్నారని, ఎయిర్ పోర్టుల్లో గుండాలను పెట్టి అడ్డుకున్నారని గుర్తుచేశారు. పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయించారని, ఇలాంటివన్నీ చేసింది జగన్మోహనరెడ్డి అన్న విషయం మరచిపోకూడదని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ కు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇవ్వాలని కానీ, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ సమకూర్చుతున్నామని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. పోలీసుల బట్టలు ఊడదీస్తామంటూ మాట్లాడే పద్ధతి సరైనదేనా? అని అనిత ప్రశ్నించారు. వైసీపీ హయాంలో 2526 హత్యలు జరిగాయని, అక్కడికి వెళ్తామన్నా కూడా తాము భద్రత కల్పిస్తామని చెప్పారు.
ఎవరైనా పోలీసు డిపార్ట్మెంట్ మీద శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడినా, పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రతా వైఫల్యం ఆరోపణలపై హోం మంత్రిగా తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్వయంగా మీటింగ్ పెట్టి.పార్టీ నిర్ణయాన్ని, ప్రభుత్వం నిర్ణయాన్ని గౌరవించాలని.. ఎవరు బయటకు రావద్దని పిలుపునిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా హోంమంత్రి అనిత గుర్తుచేశారు.
