Begin typing your search above and press return to search.

అలా చేస్తే సింగయ్య బ్రతికేవారే... జగన్ పై హోంమంత్రి ఫైర్!

అవును... తాజాగా సచివాలయంలో మాట్లాడిన హోంమంత్రి అనిత... పొదిలిలో వైసీపీ నేతల అరాచకాలను అందరూ చూశారని అన్నారు.

By:  Tupaki Desk   |   23 Jun 2025 8:50 PM IST
అలా చేస్తే సింగయ్య బ్రతికేవారే... జగన్  పై హోంమంత్రి ఫైర్!
X

జగన్ పర్యటనలో అమాయకుల ప్రాణాలు పోవడంపై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు! ఈ సందర్భంగా జగన్ పై నిప్పులు చెరిగారు. ఇద్దరు వ్యక్తులు చనిపోయినా జగన్ తన పర్యటన కొనసాగించారని.. పోలీసుల మాటలు పెడచెవిన పెడుతున్నారని.. రాజకీయాల్లో ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలని.. హింసను ప్రోత్సహించేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని హోంమత్రి మండిపడ్డారు.

అవును... తాజాగా సచివాలయంలో మాట్లాడిన హోంమంత్రి అనిత... పొదిలిలో వైసీపీ నేతల అరాచకాలను అందరూ చూశారని అన్నారు. కేవలం 10 అడుగుల వెడల్పున్న రోడ్డులో ఎలా వెళ్లాలో వైసీపీ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. పరామర్శ పేరుతో వెళ్లి జగన్‌ రోడ్‌ షో నిర్వహించారని.. కారు కింద పార్టీ కార్యకర్త పడినా గుర్తించకపోవడం దారుణమని అన్నారు.

వాస్తవానికి ఆ సమయంలో గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్తే బతికేవారేమో అని చెప్పిన అనిత... అలాకాకుండా ఏమాత్రం దయ, జాలి లేకుండా పక్కకు లాగి ముళ్లపొదల్లో పడేశారని అన్నారు. ఇద్దరు వ్యక్తులు చనిపోయినా జగన్‌ తన పర్యటన కొనసాగించారని తెలిపారు.

ఇదే సమయంలో... బెట్టింగ్‌ లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని ఏడాది తర్వాత పరామర్శిస్తారా జగన్ అని ప్రశ్నించిన అనిత... చేసిన తప్పును సమర్థించుకోవడం మరీ దారుణమని అన్నారు. ఈ సందర్భంగా... రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుడు జగన్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి... సత్యసాయి జిల్లాకు వెళ్లినప్పుడు కూడా రచ్చరచ్చ చేశారని తెలిపారు.

పొదిలి వెళ్లినప్పుడు మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేశారని.. ఇక రెంటపాళ్ల వెళ్లినప్పుడు పోలీసులు మరీమరీ చెప్పినా వినిపించుకోలేదని అన్నారు. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి పరామర్శకు వెళ్లినప్పుడు ఎలా వెళ్లాలో కూడా తెలియాదా? అని ప్రశ్నిస్తూ... బలప్రదర్శన చేయడానికే జగన్‌ బయటకు వచ్చినట్లుందని మండిపడ్డారు.

సహజంగా... రోడ్డు ప్రమాదాల సమయంలో బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు సాయం చేస్తారని.. గాయపడిన వారిని దగ్గరుండి ఆస్పత్రికి చేరుకునేలా సహాయం అందిస్తారని.. కానీ.. జగన్ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో స్థానం లేదని.. రప్పా రప్పా అంటే తప్పేంటని అడగడం ఆయన మానసిక స్థితిని తెలియజేస్తోందని హోంమంత్రి ఫైరయ్యారు.