టీ కాంగ్రెస్ తో జనసేన ఢీ.. అదిరేలా తొలి కౌంటర్!
తొందరపడి ఒక మాట అంటే.. పది మాటలు అనిపించుకోవాలి. అన్నింటికంటే ముందు పార్టీ విధివిధానాలు.. దాని నేపథ్యం.. నాయకత్వ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
By: Tupaki Desk | 10 Feb 2026 4:04 PM ISTతొందరపడి ఒక మాట అంటే.. పది మాటలు అనిపించుకోవాలి. అన్నింటికంటే ముందు పార్టీ విధివిధానాలు.. దాని నేపథ్యం.. నాయకత్వ ఆలోచనలు ఎలా ఉన్నాయి? లాంటి వాటి మీద అవగాహన ముఖ్యం. సంచలనం కోసమో.. రేసులో ముందు ఉండేందుకే తొందరపడితే తిప్పలు తప్పవు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైనట్లుగా కనిపిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని.. తాను కూడా ఎన్నికల ప్రచారం చేస్తానని జనసేన అధినేత.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించటం.. అందుకు తగ్గట్లే ఆయన ప్రచార షెడ్యూల్ సైతం విడుదలైంది. అయితే.. సాంకేతిక కారణాలతో ప్రచార టూర్ షెడ్యూల్ అయినట్లుగా జనసేన ప్రకటించింది. తెలంగాణలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను ఒక నటుడిగా పేర్కొంటూ.. ఆయన రాజకీయ విజయాల వెనుక ఎప్పుడూ ఒక ప్రొడ్యూసర్ ఉంటారన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మాగా పేర్కొంటూ.. ఆయన కుమారుడు లోకేశ్ సహ నిర్మాతగా పేర్కొన్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త ప్రొడ్యూసర్ గా తయారయ్యారంటూ విమర్శించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావన్న ఆయన.. ‘‘ఆ విషయం తెలిసే పవన్ కల్యాణ్ తన టూర్ ను క్యాన్సిల్ చేసుకున్నారు.ఆంధ్రా నేతలు కేవలం ఇక్కడ భూములు.. నిధులు కోసమే వస్తున్నారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ జనసేన ప్రచార కార్యదర్శి సాగర్. ఇక్కడే పుట్టి ఇక్కడే పోటీ చేస్తే తప్పు పడతావా? అంటూ ప్రశ్నిస్తూ.. అసలు నీకు ప్రజాస్వామ్యం తెలుసా? అని మండిపడ్డారు. ‘‘అక్కడెక్కడో ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేయగా లేనిది.. తెలంగాణలో పుట్టి పెరిగిన వారు పోటీ చేస్తే తప్పేంటి?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు.. ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలకు నిరసనగా ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట తెలంగాణ జనసేన నిరసనకు ప్లాన్ చేసింది. జాతీయ పార్టీగా ఉంటూ.. మరో రాజకీయ పార్టీ మీదా.. పార్టీ అధినేత మీద తొందరపడి వ్యాఖ్యలు చేస్తే.. తమ పార్టీనే ఇరుకున పడుతుందన్న విషయాన్ని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇప్పటికైనా గుర్తించారో? లేదో?
