కూటమిలో అనిల్ కుమార్ యాదవ్ ని కాపాడుతున్నది ఎవరు..?
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని సంగతి తెలిసిందే!
By: Tupaki Desk | 3 July 2025 8:00 PM ISTవైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని సంగతి తెలిసిందే! గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు! మైకుల ముందుకు వస్తే రాజకీయ ప్రత్యర్థులపై అంతెత్తున విరుచుకుపడిపోయారు. దీంతో... ఆయనపై తమ్ముళ్లు తీవ్ర కోపాన్ని కలిగి ఉన్నారని అంటారు.
ప్రధానంగా నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు, జనసేన కార్యకర్తలు.. అనీల్ కుమార్ యాదవ్ పేరు చెబితేనే మండిపోతున్నారని అంటారు. పైగా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కూటమి కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు చెబుతున్నారు. దీంతో... రెడ్ బుక్ లో అనిల్ కుమార్ యాదవ్ పేరు ఎర్ర సిరాతో రాసి ఉండి ఉంటుందని చాలా మంది భావించారు.. తమ్ముళ్లు ఆశించారని చెబుతారు.
అవును... అధికారంలో ఉన్న సమయంలో ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు లోకేష్ తన రెడ్ బుక్ లో రాసుకున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో.. ఆ బుక్ లో పేర్లున్న పలువురు నేతలు ఇప్పటికే శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్లి వచ్చిన పరిస్థితి అని అంటున్నారు. మరి అనీల్ కుమార్ యాదవ్ ని ఎందుకు టచ్ చేయడం లేదు అనే చర్చ నెట్టింట మొదలైంది!
ప్రధానంగా వల్లభనేని వంశీ, నందిగాం సురేష్ లు దాదాపు ఒకరోజు గ్యాప్ లో జైలు నుంచి విడుదలైన అనంతరం... తదుపరి పేరు ఎవరిదనే చర్చ సోషల్ మీడియా వేదికగా మొదలైంది. దీంతో పలువురు వైసీపీ కీలక నేతలు, మాజీ మంత్రుల పేర్లు తెరపికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది!
ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోందని అంటున్నారు. ఇందులో భాగంగా... కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కూడా అనిల్ పై ఎలాంటి చర్యలూ తీసుకోబడకపోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉందని.. అసలు ఆయన ప్రస్తావనే లేకుండా పోవడం వెనుక ఇద్దరు కీలక నేతల పాత్ర ఉందనే చర్చ నడుస్తోంది.
ఇందులో భాగంగా... ఇద్దరు కీలక సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు.. అనిల్ వెనుక చక్రం తిప్పుతున్నారని, ఆయనకు ఎర్రబుక్ నుంచి రక్షణగా ఉన్నారని.. గతంలో అందరూ ఒకే పార్టీలో ఉన్న సమయంలో తమకు అన్నివిధాలా మేలు చేసిన అనిల్ ను ఇప్పుడు కాపాడుకునే బాధ్యత వారు తీసుకున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది!
అయితే... వారు ఎవరా అన్నది మాత్రం ప్రస్తుతానికి రహస్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో జరుగుతున్న ప్రచారం, వినిపిస్తున్న గుసగుసలు ఎంత వరకూ నిజం, మరెంత వరకూ అసత్యం అనేది తెలియాలంటే.. వేచి చూడాలి!!
