Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్ కి జగన్ మార్క్ షాక్ !

ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా యువ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఒక రేంజిలో హవా చలాయించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Feb 2025 1:32 PM IST
ఫైర్ బ్రాండ్ కి జగన్ మార్క్ షాక్ !
X

వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలకు తక్కువేమీ లేదు. వారి సంఖ్య అలా ఎక్కువైపోవడం వల్లనే వైసీపీ 2024 ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. వీరిని మంత్రులుగా కూడా చేశారు. దాంతో వారు మీడియా ముందుకు వచ్చి చేసిన ప్రకటనలు పార్టీకి ప్రభుత్వానికి వీసమెత్తు లాభం తేలేకపోగా తీరని నష్టాన్ని కలిగించాయని ఆ తరువాత లెక్క తేలింది.

ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా యువ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఒక రేంజిలో హవా చలాయించిన సంగతి తెలిసిందే. ఆయన మూడేళ్ళ పాటు కీలకమైన జలవనరుల శాఖకు మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కూడా చక్రం తిప్పడంతో బలమైన సామాజిక వర్గం నానా ఇబ్బందులు పడింది. వాటి మీద వైసీపీ అధినాయకత్వానికి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకపోగా అనిల్ కే మద్దతుగా నిలిచింది. ఆఖరుకు వైసీపీకి అంగబలం అర్ధబలం సమకూర్చి పెట్టిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి వారు పార్టీని వీడడం వెనక కూడా వర్గ పోరు ఉందని అంటున్నారు.

ఇలా వైసీపీకి కంచుకోట అయిన నెల్లూరు జిల్లాలో పార్టీ దారుణ పరాజయం వెనక అనిల్ పాత్ర కూడా ఉందని పార్టీ నేతలు అధినాయకత్వం దృష్టికి తీసుకుని వచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు వైసీపీ ఓటమి తరువాత అనిల్ అయిపూ అజా లేకుండా పోయింది. ఆయన నెల్లూరులో ఉంటున్నారా లేక ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితి అని అంటారు.

ఆయన మౌనాన్ని ఆశ్రయించడంతో వైసీపీ కూడా తనదైన శైలిలో నిర్ణయాలను తీసుకుంది అని అంటున్నారు. ఈ క్రమంలో నెల్లూరు అర్బన్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డికి అధినాయకత్వం అప్పగించింది. దాంతో ఆయన ఇపుడు యాక్టిగా మారి పార్టీని ఒక గాడిన పెడుతున్నారు.

మరో వైపు చూస్తే నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డితోనూ అనిల్ కుమార్ కి పడదని ప్రచారంలో ఉంది. ఇలా కీలక నేతలతో ఆయనకు ఉన్న విభేదాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కూడా ఆయను కాస్తా సైడ్ పెట్టిందని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అనిల్ కుమార్ యాదవ్ తన పట్టుని జిల్లాలో చూపించుకోవడానికి అన్నట్లుగా ఆనాడు వైసీపీ అధినాయకత్వం తో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆసగారా చేసుకుని చేసిన కార్యక్రమాల వల్లనే పార్టీ ఈ రోజు ఈ దుస్థితికి వచ్చిందని పార్టీ వర్గాలు అంటున్నాయట.

మొత్తానికి చూస్తే అనిల్ కుమార్ కూడా ఎందుకో పార్టీ తీరు పట్ల అసంతృప్తితో దూరం జరిగారా అన్న చర్చ కూడా ఉంది. ఏదైతేనేమి ఆయన సైలెంట్ అయ్యారు. వైసీపీ అధినాయకత్వం కూడా ఆయనను సైడ్ చేసింది అని అంటున్నారు.

నెల్లూరు జిల్లా విషయంలో వైసీపీ ఫోకస్ పెట్టి అసలు వాస్తవాలు తెలుసుకోవడం మంచి పరిణామమే అని అంటున్నారు. వైసీపీకి పూర్వ వైభవం దక్కాలీ అంటే పార్టీకి భారంగా మారిన వారిని పక్కన పెట్టాల్సిందే అని అధినాయకత్వం డిసైడ్ అయింది అని అంటున్నారు.

ఈ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ తిరిగి పార్టీలో యాక్టివ్ అవుతారా ఒకవేళ ఆయన చురుకైన పాత్ర పోసించడానికి సిద్ధపడితే ఆయనకు ఏ రకమైన పదవులు ఇస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ అధినాయకత్వంలో ఈ రకమైన మార్పు రావడం పార్టీకి మంచి పరిణామమే అని అంటున్నారు.