ఊహించని మలుపు.. మాజీ మంత్రి అనిల్ కు పోలీసు పిలుపు
అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూరు వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసుల నుంచి పిలుపువచ్చింది.
By: Tupaki Desk | 24 July 2025 1:33 PM ISTఅక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూరు వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసుల నుంచి పిలుపువచ్చింది. మాజీ మంత్రి అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలంతో అక్రమ మైనింగు కేసులో అనిల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, ఆ కేసు కాదని పోలీసులు మరో విషయంలో విచారణకు రావాల్సిందిగా మాజీ మంత్రికి నోటీసులు జారీ చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రిని ప్రశ్నించాలని పోలీసులు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని దూషించిన కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పైనా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఈ విషయంలో మాజీ మంత్రిని ప్రశ్నించేందుకు ఈ నెల 26న కోవూరు పోలీసుస్టేషనులో హాజరుకావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం మాజీ మంత్రి నివాసానికి కోవూరు ఎస్ఐ రంగనాథ్ వెళ్లి నోటీసులు అందివ్వాలని ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో నోటీసులను ఇంటి గోడకు అంటించారు.
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన పోలీసులు, అదే కేసులో అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. కాగా, ప్రశాంతి రెడ్డిపై దారుణంగా మాట్లాడిన వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై కొందరు వ్యక్తులు దాడులకు దిగారు. ఇంట్లో ఫర్నీచర్ తోపాటు గృహోపరకరణాలు అన్నీ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపైనా పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై సీరియస్ గా ఉన్న ప్రభుత్వం ముందు ప్రసన్నకుమార్ రెడ్డి, ఇప్పుడు అనీల్ కుమార్ యాదవ్ ను విచారణకు పిలవడంతో ఉత్కంఠ మొదలైంది.
