జగన్ సన్నిహిత మాజీ మంత్రి అక్కడ గురి ?
అయితే రెండేళ్ళ పాటు కావాలనే వ్యూహాత్మకంగా విరామం ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఇపుడు మళ్ళీ స్పీడ్ పెంచారు అని అంటున్నారు.
By: Satya P | 15 July 2026 7:00 AM ISTవైసీపీ అధినేత జగన్ కి ఆ మాజీ మంత్రి అత్యంత సన్నిహితుడు. ఎంతలా అంటే ఆయన కోసం పార్టీలో బిగ్ షాట్స్ వెళ్ళినా తగ్గలేదు. ఆయన కోరిన వారికే టికెట్లు ఇచ్చారు. అలా నెల్లూరు రాజకీయాల్లో చక్రం తిప్పి కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ పార్టీలో యాక్టివ్ అవుతున్నారు. ఆయన వైసీపీ ఓటమి తరువాత ఎక్కడా కనిపించలేదని గతంలో ప్రచారం సాగింది. అయితే రెండేళ్ళ పాటు కావాలనే వ్యూహాత్మకంగా విరామం ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఇపుడు మళ్ళీ స్పీడ్ పెంచారు అని అంటున్నారు. దాంతో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనిల్ కుమార్ మళ్ళీ చర్చగా మారుతున్నారు.
ఆ సీటు నుంచే పోటీ :
ఇదిలా ఉంటే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు అర్బన్ నుంచి 2014, 2019లో గెలిచారు. ఆ వెంటనే మంత్రి కూడా అయ్యారు. అయితే మంత్రిగా ఉన్నపుడు జిల్లాలోని సీనియర్ నేతలను అలాగే బలమైన సామాజిక వర్గాన్ని ఆయన పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి. ఇక వర్గ పోరు కూడా తీవ్రంగా పెరిగింది అన్నది ఉంది. జిల్లా మంత్రిగా మూడేళ్ళ పాటు పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి కాగానే ఒంటరి అయిపోయారు. దాంతో ఒక దశలో ఆయన రాజకీయం నెల్లూరు జిల్లాలో నడవలేదు అని చెబుతారు. ఆయన నరసారావు పేట నుంచి ఎంపీగా పోటీ చేయడం విశేషం. ఇక తన సన్నిహిత నేతకు నెల్లూరు అర్గన్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్న అనిల్ కుమార్ జగన్ కి తాను సన్నిహితుడిని అని చాటుకున్నారు.
నెల్లూరు నుంచే బరిలోకి :
ఇక వంశీ 2029 ఎన్నికల మీద ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు. ఆయన తిరిగి నెల్లూరు అర్బన్ సీటు మీదనే దృష్టి పెట్టారని అంటున్నారు. తనకు కలసి వచ్చిన సీటు మంత్రిగా చేసిన చోటు నుంచే పోటీ చేస్తే రాజకీయంగా సిరిని అందుకోవచ్చు అన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. నెల్లూరు అర్బన్ లో తనకు పలుకుబడి ఉందని దాంతో ఈసారి గెలుపు సులువు అవుతుందని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. ఆయన నెల్లూరు అర్బన్ లోనే ఎక్కువ గడుపుతున్నారు అని అంటున్నారు. తమ పార్టీ వారిని దగ్గరకు తీస్తున్నారు. వారితో సమావేశాలు జరుపుతున్నారు. వైసీపీకి కూడా నెల్లూరు అర్బన్ లో ధీటైన నేత లేకపోవడంతో అనిల్ కుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా పార్టీలో ప్రచారం సాగుతోంది.
టీడీపీకి గట్టి పట్టు :
ఇదిలా ఉంటే నెల్లూరు అర్బన్ టీడీపీకి గట్టి పట్టు ఉన్న చోటుగా చెబుతున్నారు. అనిల్ కుమార్ గెలవడానికి కారణం అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. అలాగే వైసీపీలో ఉంటూ పార్టీకి ఎంతో అండగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి కూడా టీడీపీలో కీలకంగా ఉండడమే కాదు నెల్లూరు నుంచి ఎంపీగా ఉన్నారు. ఇక అనిల్ సొంత బాబాయ్ కూడా వైసీపీని వీడిపోయారు. అనుచర వర్గం చెల్లా చెదురు అయింది. మరో వైపు చూతే మంత్రి నారాయణ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఆయన వ్యూహాలతో నెల్లూరు అసెంబ్లీ సీటులో పటిష్టం అయ్యారు. మరి నారాయణను ఢీ కొట్టడం అనిల్ కుమార్ యాదవ్ కి అంత ఈజీ అవుతుందా అన్నదే చర్చగా ఉందిపుడు. అయితే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ హవా ఉంటుందని దానికి తోడు పార్టీని బలోపేతం చేసుకుంటే తిరుగు ఉండదని అనిల్ కుమార్ భావిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి అనిల్ కుమార్ నెల్లూరు నుంచే మరోసారి తన రాజకీయ జాతకాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడుతున్నారని అంటున్నారు.
