Begin typing your search above and press return to search.

50 సంస్థలు, 25 మంది వ్యక్తులు, 30 ప్రదేశాలు... అంబానీకి ఈడీ షాక్!

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి చెందిన ఆఫీసుల్లో దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది.

By:  Tupaki Desk   |   24 July 2025 12:37 PM IST
50 సంస్థలు, 25 మంది వ్యక్తులు, 30 ప్రదేశాలు... అంబానీకి ఈడీ షాక్!
X

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి చెందిన ఆఫీసుల్లో దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా... దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబైలోని పలు ప్రదేశాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. అయితే.. అనిల్ అంబానీ వ్యక్తిగత నివాసానికి మాత్రం ఈడీ అధికారులు వెళ్లలేదని కథనాలొస్తున్నాయి.

అవును... రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఆ సంస్థ ప్రమోటర్-డైరెక్టర్ అనిల్ అంబానీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'మోసం'గా పరిగణించిన కొద్ది రోజుల తర్వాత ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించడం గమనార్హం. ఈ దర్యాప్తు రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ (ఆర్.ఏ.ఏ.జీ.ఏ) కంపెనీల ద్వారా జరిగిన మనీలాండరింగ్‌ కు సంబంధించినదని అంటున్నారు.

ఈ సందర్భంగా... సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్‌.ఎఫ్‌.ఆర్‌.ఏ), నేషనల్ హౌసింగ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన రెండు ఎఫ్‌.ఐ.ఆర్‌.లతో సహా పలు ఆర్థిక సంస్థల నుండి వచ్చిన ఇన్‌ పుట్‌ ల ఆధారంగా ఈడీ చర్య తీసుకుందని చెబుతున్నారు.

2017 నుండి 2019 వరకు 'ఎస్' బ్యాంక్ నుండి తీసుకున్న రూ. 3,000 కోట్ల రుణాలను అక్రమంగా మళ్లించినట్లు అనుమానిస్తున్న కేసుపై దర్యాప్తు దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో.. విస్తృత దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీ గ్రూప్‌ తో సంబంధం ఉన్న సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌ లను కూడా సోదా చేస్తున్నారని కథనాలొస్తున్నాయి.

ఈ ఆపరేషన్‌ లో భాగంగా.. ఈ కేసుతో సంబంధం ఉందని చెప్పబడుతున్న 50కి పైగా సంస్థలపై ఈడీ అధికారులు దాడులు చేసి రికార్డులను పరిశీలించారని తెలుస్తోంది. ఇదే క్రమంలో.. 25 మందికి పైగా వ్యక్తులను కూడా ప్రశ్నించారని చెబుతున్నారు. ఈ క్రమంలో.. సుమారు 35 ప్రదేశాలలో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.